● గూడూరు సమన్వయకర్త
బూదూరు గురవయ్య
చిల్లకూరు: కూటమి పాలనలో అవినీతి పెరిగిందని, అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం ఎంత వరకు న్యాయమని ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌ను వైఎస్సార్‌సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య ప్రశ్నించారు. గూడూరులోని ఓ హోటల్లో శుక్రవారం ఆయన నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పట్టణంలోని రెండు ఆలయాలకు చెందిన భూముల లీజుల విషయంలో నిబంధనలు పాటించకుండా తూతూమంత్రంగా వేలం పాటలు నిర్వహించడం నిజం కాదా అని ప్రశ్నించారు. ధర్మరాజు స్వామి దేవస్థానంలో సుమారు రూ.1.50 కోట్ల అవినీతి జరిగిందన్నారు. దుకాణాల బాడుగుల విషయంలో ఎవరికి వారుగా అద్దెల పేరుతో వసూలు చేసుకుని ఆరగిస్తున్నారన్నారు. చిల్లకూరు మండలంలోని కలవకొండలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నిధుల దుర్వినియోగం జరుగుతోందని చైర్‌పర్సన్ వినతిపత్రాన్ని దేవదాయ మంత్రికి అందించారన్నారు. మంత్రి దానిని బుట్టదాఖలు చేస్తే తమ పార్టీపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వేలం పాటలు జరిగిన సమయంలో పల్లి కోటేశ్వరరావు అనే తమ పార్టీ కార్యకర్త ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా, బెదిరించినా భయపడే ప్రసక్తే లేదు. కడివేడు భూములపై విచారణ చేపడతామని ఎమ్మెల్యే చెప్పారే తప్ప కార్యరూపం దాల్చలేదన్నారు. ప్రతి అవినీతిలో ఎమ్మెల్యేకు వాటా ఉందన్నారు. కోటేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీలో విధానాలు నచ్చక వైఎస్సార్‌సీపీలో చేరారని చెప్పారు. ఎమ్మెల్యే, అతని అనుచరుల నుంచి ప్రాణహాని ఉందన్నారు. చెన్నూరుకు చెందిన నాయకుడు కల్లూరు రవి మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఉన్న ఆలయ భూములకు సంబంధించి దండోరా వేయకుండా ఏకపక్షంగా అధికార పార్టీ నాయకులు లీజు పొందడం ఏమిటని ప్రశ్నించారు. చిల్లకూరు జెడ్పీటీసీ సభ్యుడు మన్నెం శీనయ్య మాట్లాడుతూ చిల్లకూరు మండలంలో జాతీయ రహదారి వెంబడి ముత్యాలపాడు పంచాయతీలో రూ.కోట్ల విలువైన భూములు అప్పనంగా మింగేశారన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ముప్పాళ్ల చంద్రమోహన్‌రెడ్డి, అట్ల శ్రీనివాసులురెడ్డి, యల్లా శ్రీనివాసులురెడ్డి, ఇందుకూరు జనార్దనరెడ్డి, డేగపూడి కృష్ణారెడ్డి, వేణురెడ్డి, వసంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


