కావలి: అమ్మా ఆకలిగా ఉంది. అన్నం పెట్టాలని అడిగాడు. పాపం జాలిగుండె కలిగిన మహిళ పండు అందించింది. కొద్దిసేపటి అనంతరం కునుకు తీస్తున్న ఆమె మెడలోని బంగారు చైన్ లాక్కొని పరారయ్యాడు. శుక్రవారం మధ్యాహ్నం కావలి జనతాపేట ఉత్తర శివార్లలో ఈ ఘటన జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. జనతాపేటకు చెందిన కంచర్ల సంపూర్ణమ్మ కంచర్ల వస్త్ర దుకాణం నిర్వహిస్తోంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా కలుగోళ్లమ్మ ఆలయానికి వెళ్లొచ్చి వ్యాపారంలో నిమగ్నమైంది. మధ్యాహ్నం వేళ గుర్తుతెలియని ఓ యువకుడు వచ్చి ఆకలేస్తుందమ్మా అని చేయి చాచాడు. ఇది ఇల్లు కాదు నాయనా షాపు అని చెప్పి అరటి పండు అందించింది. అది తీసుకుని తిరుగుముఖం పట్టిన అతను ఆమె ఆదమరిచి కునుకు తీస్తున్న సమయంలో వచ్చి ఒక్కసారిగా మెడలోని మూడున్నర సవర్ల బంగారు చైన్ లాక్కెళ్లాడు. బాధితురాలు తేరుకునేలోపే అతను అదృశ్యమయ్యాడు. మహిళ చుట్టుపక్కల వారికి విషయం తెలిపి లబోదిబోమంది. సంపూర్ణమ్మ కుమారుడు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కావలి డీఎస్పీ వీవీ రమణకుమార్ సీఐ గిరిబాబుతో దుకాణం వద్దకు వెళ్లి బాధితురాలితో మాట్లాడారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు.


