నెల్లూరు(అర్బన్): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులర్ చేసే వరకూ నిరంతర ఆందోళనలు చేస్తామని ఏపీ మెడికల్, హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ జేఏసీ కన్వీనర్ శరత్‌బాబు తెలిపారు. నెల్లూరు దర్గామిట్టలో ఉన్న సర్వజన ఆస్పత్రిలో నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరైన కాంట్రాక్ట్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు శుక్రవారం మధ్యాహ్నం ఐపీ భవనం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ తాము 20 ఏళ్లకు పైగా కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. పెన్షన్, ఇతర ఎలాంటి బెనిఫిట్స్ లేవన్నారు. రెగ్యులర్ నర్సులు, ఇతర సిబ్బందితో సమానంగా పని చేస్తున్నప్పటికీ వేతనంలో భారీ తేడా ఉందన్నారు. అరకొర వేతనాలతోనే సంవత్సరాల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ బదిలీ అయిన ప్రతిచోట విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమానపనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ 100శాతం గ్రాస్ వేతనం ఇవ్వాలని పేర్కొన్నారు. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రే షియా చెల్లించాలని కోరారు. అనారోగ్యానికి గురైన ఉద్యోగులకు పూర్తి వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు రూత్‌గ్రేస్, వేణు, సుమతి, మేరి మాధురి తదితరులు పాల్గొన్నారు.


