● కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరించాలి
● సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజయ్‌కుమార్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘ఎన్నికల సమయంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని మరిచిపోయినట్టున్నారు. హామీ మేరకు వెంటనే కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్ టెర్మినల్‌ను పునరుద్ధరించి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలి’ అని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజయ్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నెల్లూరు జేమ్స్ గార్డెన్‌లో ఉన్న సీఐటీయూ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కృష్ణపట్నం పోర్టు బొగ్గు, బూడిద, ఐరన్‌ఓర్‌తో డర్టీ పోర్టుగా మారిందని అసెంబ్లీలో సోమిరెడ్డి అన్నారన్నారు. అయితే ప్రజలకు కావాల్సింది ఇది కాదన్నారు. కూటమి అధికారంలోకి వస్తే వెంటనే టెర్మినల్‌ను తెరిపిస్తానని చెప్పి ఇప్పుడు డర్టీ పోర్టుగా మారిందని చెప్పడం సరికాదన్నారు. 4 వేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకులు రెహనాబేగం, గోపాల్, గడ్డం అంకయ్య పాల్గొన్నారు.


