అప్రమత్తంగా ఉండాలి
● దంతాల ఇన్ఫెక్షన్‌తో ఓరల్ కేన్సర్ రిస్క్
● జిల్లాలో 3 లక్షల మందికి
వివిధ సమస్యలు
● నేడు ప్రపంచ ఓరల్ హెల్త్ డే
నెల్లూరు(అర్బన్): మనం తినే ఆహారం నోటి ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలాంటి నోటిని పరిశుభ్రంగా ఉంచుకోకపోవడంతో దంతాలు పుచ్చిపోతాయి. చిగుళ్లు గట్టిగా ఉండవు. చూడటానికి అసహ్యంగా కనిపిస్తాయి. ఫలితంగా నోటి జబ్బులతోపాటు గుండె జబ్బులు, షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని శాస్తవేత్తలు పేర్కొంటున్నారు. నోటిలో పలు ఇన్ఫెక్షన్లు సోకుతాయి. అంతేకాకుండా పుచ్చి పళ్లతో నలుగురిలో సక్రమంగా మాట్లాడలేక మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నోటి వ్యాధులను తగ్గించేందుకు మార్చి 20వ తేదీని ప్రపంచ ఓరల్ డేగా ప్రకటించి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా జిల్లాలో శుక్రవారం జిల్లా వైద్యారోగ్య శాఖ, ఇతర వైద్యుల పర్యవేక్షణలో కార్యక్రమాలు జరుగుతాయి.
అనేకమందికి..
భారతదేశంలో 70 శాతం మంది ప్రజలు దంత, నోటి సమస్యలతో బాధపడుతున్నారని శాస్త్రవేత్తలు తెలిపారు. నెల్లూరు జిల్లాలో సుమారు 3 లక్షల మందికి పైగా ఏదో ఒక దంత సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవల కాలంలో చిన్నపిల్లల్లో ఎక్కువగా దంత క్షయ సమస్యలు కనిపిస్తున్నాయి. మారిన జీవనశైలి, జంక్‌ఫుడ్స్ వల్ల శుభ్రత లోపించి పిల్లల నుంచి పెద్దల వరకు దంత సమస్యలతో బాధపడుతున్నారు. నోటిలో పుండ్లు, పొక్కడం, చిగుళ్లు వాపు, గమ్ డిసీజెస్, దుర్వాసన వంటి సమస్యలు పెరుగుతున్నాయి.
సమస్యలు తగ్గాలంటే..
దంత సమస్యలు లేకుండా ఉండాలంటే డాక్టర్ల సలహాలు పాటించాలి. వాటిలో ప్రధానంగా గుట్కా, ఖైనీ, పాన్‌పరాగ్, చుట్ట, బీడీ, సిగరెట్ లాంటి పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. వాటిని వినియోగిస్తే నోటి కేన్సర్లు ఎక్కువగా వస్తాయి. ఉదయం నిద్రలేచిన తర్వాత, రాత్రి పడుకోబోయే మందు రోజూ రెండు దఫాలుగా బ్రష్ చేసుకోవాలి. బ్రష్‌ను ప్రతి మూడునెలలకో దఫా మార్చాలి. ఆహారం తిన్న తర్వాత నోటిని మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచే దంత శుభ్రత అలవాటు చేయాలి.
నిర్లక్ష్యం చేస్తే..
దంతాలు పుచ్చిపోవడం, చిగుళ్లలో చీము కారడం కేన్సర్‌కు నేరుగా కారణం కాదు. అయితే నోటిలో దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ల కారణంగా చిగుళ్లు వాచి, దవడ ఎముక మెత్తబడొచ్చు. అలాంటి పరిస్థితుల్లో నోటి టిష్యూలు దెబ్బతింటాయి. ఇలా జరగడం వల్ల నేరుగా కేన్సర్‌ను కలిగించకపోయినప్పటికీ ఆ రిస్క్ ను పెంచే ఫ్యాక్టర్‌గా మారొచ్చు. అందువల్ల దంత సమస్యలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. నోరు పొక్కినా, పుండు ఏర్పడినా, దంతాలు జిల్లుమని పిస్తూ చల్లటి వస్తువులను తినలేకపోయినా డాక్టర్‌ను సంప్రదించేలా ప్రోత్సహించాలి. ప్రతి ఆరునెలలకోసారి దంతాలు చెక్ చేయించుకోవాలి.
దంత సమస్యలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. జంక్ ఫుడ్‌వల్ల చిన్నపిల్లలో కూడా పాలదంతాలు త్వరగా పుచ్చిపోతున్నాయి. మారిన జీవనశైలి వల్ల పెద్దల్లో సైతం ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి. దంతాలు రంగు మారుతున్నా, కొంచెం పుచ్చిపోయినా వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలి. ప్రాథమిక దశలో సులభతరంగా క్లీన్ చేసి సిమెంట్ పెట్టేస్తాం. నిర్లక్ష్యం చేస్తే రూట్ కెనాల్ లాంటి ఖరీదైన వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది. పొగాకు అలవాటు పూర్తిగా మానాలి. గార, చిగురు తినేయడం లాంటి సమస్యలున్నప్పుడే డాక్టర్ ద్వారా వైద్య చికిత్స పొందాలి. ఆరునెలలకు ఒకసారి దంత పరీక్షలు చేయించుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రిలో పళ్లను క్లీన్ చేయడం, జ్ఞాన దంతాలను తొలగించడం, పుచ్చిన పళ్లకు సిమెంట్ పెట్టడం లాంటి సేవలు ఉచితంగా చేస్తున్నాం. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ ఎం.హిమబిందు, ఎండీఎస్, డెంటిస్ట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, నెల్లూరు


