● పోలీస్‌స్టేషన్ ఎదుట దళిత సంఘాల నిరసన
● డీఎస్పీకి వినతిపత్రం అందజేత
విడవలూరు: మండలంలోని ముదివర్తి గ్రామం దళితవాడకు చెందిన పట్టపు రోహిత్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు కారణమైన టీడీపీ నాయకుడు ఫేక్ రఫీపై బలమైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్ నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్లు సాల్మన్ రాజ్, బీఆర్మీ రాష్ట్ర నాయకుడు పొంగులూరు ప్రసాద్ మాట్లాడుతూ రోహిత్ విషయంలో పోలీసుల వైఖరి మార్చుకోవాలన్నారు. లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నారు. బీఎస్పీ నాయకురాలు అరుణమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయన్నారు. యువకుడిని కులం పేరుతో దూషించి ఆత్మహత్యాయత్నం చేసుకునేలా ప్రేరేపించిన రఫీపై స్టేషన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. న్యాయం చేయకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతామన్నారు.
న్యాయం చేయాలి
రోహిత్‌ను అవమానించిన వ్యక్తిని పోలీసులు చట్టపరంగా కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు పట్టపు నాగరత్నం, ప్రశాంతి, తమ్ముడు రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. టీడీపీ నాయకుడు రఫీపై బలమైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయకపోతే పోలీస్‌స్టేషన్ ఎదుట గడ్డిమందు తాగి చనిపోతామని తెలియజేశారు. రఫీని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని స్థానికులు కోరారు.
డీఎస్పీకి వినతి
పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావుకు రోహిత్ తల్లితండ్రులు, స్థానికులు, దళిత సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. దళితులమని తమపై చిన్నచూపు చూడటం తగదన్నారు. రఫీని వెంటనే అదుపులోకి తీసుకోవాలని కోరారు. సెల్ఫీ వీడియో ఆధారంగానే కేసు నమోదు చేయడం జరిగిందని, కేసును పూర్తిగా విచారిస్తామని, అవసరమైతే వేరే సెక్షన్లు కూడా కలిపి న్యాయం చేస్తామని డీఎస్పీ తెలియజేశారు. కార్యక్రమంలో అంబేడ్కర్ రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు దానం మాల్యాద్రి, నాయకులు ముసలి నరేంద్ర, స్థానిక మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


