సైదాపురం: రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఓ యువకుడు గురువారం గంగ కాలువలో చనిపోయి కనిపించడంతో బాధిత కుటుంబంలో విషాదం నెలకొంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మండలంలోని చాగణం గ్రామానికి చెందిన బంకాపూరి సుబ్బయ్య కుమారుడు మణికంఠ (19) గూడూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఆంజనేయ స్వామి గుడి వద్దకు వెళ్లి వస్తానంటూ ఇంట్లో నుంచి బైక్ తీసుకుని బయటకు వచ్చాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారమిచ్చారు. మర్లపూడి సమీపంలో ఉన్న తెలుగుగంగ ప్రధాన కాలువ వద్ద బైక్‌ను గుర్తించారు. దీంతో ఎస్సై క్రాంతికుమార్ స్థానికుల ద్వారా కాలువలో గాలించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. గురువారం మధ్యాహ్నం డక్కిలి సమీపంలో ప్రవహిస్తున్న కండలేరు ప్రధాన కాలువ వద్ద మణికంట మృతదేహం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారొచ్చి మృతదేహాన్ని బయటకు తీయించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
బీఎస్‌ఎన్‌ఎల్
కార్యాలయంలో రాగివైరు చోరీ
● ముగ్గురు దొంగల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో రాగివైరును చోరీ చేసిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం నెల్లూరులోని చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌లో స్థానిక ఎస్సై అబ్దుల్ రజాక్ నిందితుల వివరాలను వెల్లడించారు. ఓల్డ్ జూబ్లీ హాస్పిటల్ సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో ఇటీవల గుర్తుతెలియని దొంగలు 200 మీటర్ల రాగివైర్‌ను చోరీ చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్ ఇంజినీర్ రమేష్ ఈ ఘటనపై బుధవారం చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు నేతృత్వంలో ఎస్సై అబ్దుల్ రజాక్ తన సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతికత ఆధారంగా నిందితులు ముత్తుకూరుకు చెందిన కుమార్, రాజుపాళేనికి చెందిన వెంకయ్య, అయ్యప్పగుడి ప్రాంతానికి చెందిన ఖలీంగా గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం సీఏఎం హైస్కూల్ ప్రాంగణంలో నిందితులను అరెస్ట్ చేసి 40 మీటర్ల రాగివైరును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసిన ఎస్సై, హెచ్‌సీ సురేష్, పీసీలు వర్ధన్, సుబ్బారావు, దయాశంకర్, దేవాయ నాయుడును ఉన్నతాధికారులు అభినందించారు.


