చిల్లకూరు: క్రిస్‌సిటీకి సేకరించిన భూములకు సంబంధించి పరిహారం అందించే విషయంలో అధికారుల తీరును రైతులు తప్పు పడుతున్నారు. కోట మండలంలో ఒకలా.. చిల్లకూరు మండలంలో ఒకలా ధరలు నిర్ణయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిల్లకూరు మండలం తమ్మినపట్నం రెవెన్యూ పరిధిలో సుమారు 116 ఎకరాలు, కోట మండలం కొత్తపట్నం రెవెన్యూ పరిధిలో సుమారు 105 ఎకరాల వరకు పట్టా భూములను రెండు సంవత్సరం క్రితం సేకరించారు. వీటికి పరిహారం అందించే విషయంలో కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. దీంతో రైతులు పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. అలాగే ఆ భూముల్లో సాగుకు సిద్ధమయ్యారు. పట్టా భూములకు ఎట్టకేలకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ఎంత ఇవ్వాలనే విషయంపై రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకోలేదు. అధికారులే రియల్ ఎస్టేట్‌లో ప్లాట్ ధరలు ఏ విధంగా ఉంటాయో అలా ధరలు నిర్ణయించి పరిహారం అందించాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో తాతల కాలం నుంచి సాగు చేసుకునే పట్టా భూములకు ఈ విధంగా ధరలు పెట్టడంపై రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని అధికారుల వద్ద బుధవారం మొరపెట్టుకోగా అవార్డు పూర్తి చేశాం. తీసుకెళ్లండి. లేకుంటే కోర్టులో జమ చేస్తాం. అక్కడ తీసుకోండని చెప్పడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.
రైతుల అసంతృప్తి
పట్టా, సీజేఎఫ్‌ఎస్, డీకేటీ, అసైన్‌మెంట్, ఇలా పలు రకాల కేటగిరీల్లో ఉన్న భూములను చిల్లకూరు, కోట మండలాల్లో ఏపీఐఐసీ సేకరించింది. క్రిస్‌సిటీ కోసం సేకరించిన భూములు అధిక భాగం చిల్లకూరు మండలంలోనే ఉన్నాయి. అయితే కోట మండలంలో పట్టా, సీజేఎఫ్‌ఎస్ భూములకు పరిహారం ఒకేలా ఇస్తున్నారు. కానీ చిల్లకూరు మండలంలో పట్టా భూమికి ఒక ధర, సీజేఎఫ్‌ఎస్ భూమికి ఒక ధర నిర్ణయించడంపై రైతులు మండిపడుతున్నారు. సేకరించిన భూములన్నీ క్రిస్‌సిటీ కోసమే అయితే రెండు మండలాల్లోని రైతుల మధ్య విభేదాలు సృష్టించేలా అధికారులు వ్యవహరించడం ఎంతవరకు సబబని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రెండు మండలాలకు ఒకేలా పరిహారం ఇవ్వాలని గతంలో ఆందోళనలు చేపట్టిన సమయంలో అంగీకరించిన అధికారులు నేడు గుట్టుచప్పుడు కాకుండా ధరలు నిర్ణయించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. చెక్కులు తీసుకెళ్లాలని చెప్పడం సరైన నిర్ణయం కాదని రైతులు అంటున్నారు. పక్క మండలంలో పట్టా భూములు, సీజేఎఫ్‌ఎస్ భూములకు పరిహారం ఎలా ఇస్తున్నారో అలానే చిల్లకూరు మండలంలో కూడా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళనలు చేపడతామని చెబుతున్నారు.
కోట మండలంలో ఒకలా..
చిల్లకూరు మండలంలో మరోలా..
అధికారుల నిర్ణయంపై విస్మయం
రియల్ ఎస్టేట్ ధరల్లా పరిహారం చెల్లింపు
అవార్డు తీసుకెళ్లాలని ఒత్తిడి


