● ఇద్దరు యువకుల దుర్మరణం
● చిత్తలూరులో విషాదం
చేజర్ల: మోటార్‌బైక్ అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి రచ్చబండను ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి మండలంలోని చిత్తలూరులో జరిగింది. చేజర్ల పోలీసుల కథనం మేరకు.. మండలంలోని చిత్తలూరు ఎస్సీ కాలనీకి చెందిన సిద్ధి మురళి (25), సిద్ధి హరీష్ (26) పని నిమిత్తం పొదలకూరు పట్టణానికి బైక్‌పై వెళ్లి అర్ధరాత్రి స్వగ్రామానికి వస్తున్నారు. బైక్ వేగంగా గ్రామంలోకి ప్రవేశించగానే అదుపుతప్పి ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కనే ఉన్న రచ్చబండను ఢీకొట్టింది. దీంతో హరీష్, మురళి అక్కడికక్కడే మృతి చెందారు. తెల్లవారుజామున ఆ దారిన వెళ్లే వాహనచోదకులు చూసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. ఇంటికి 200 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది. హరీష్‌కు ఇటీవల వివాహమైంది. మురళీకి వివాహమై చిన్నబాబు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని గురువారం ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్, సంగం సీఐ శ్రీనివాసులురెడ్డి, చేజర్ల ఎస్సై తిరుమలరావు పరిశీలించారు.
అనుమానాస్పద
స్థితిలో వ్యక్తి మృతి
కావలి రూరల్: కావలి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండాయగారిపాళేనికి చెందిన మన్నెం మాల్యాద్రి (50) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రూరల్ ఎస్సై తిరుమలరెడ్డి కథనం మేరకు.. మాల్యాద్రికి మద్యం తాగే అలవాటు ఉంది. బుధవారం ఉదయం బుడంగుంట నక్కల కాలనీలో ఉన్న తన అక్క మల్లేశ్వరి ఇంటికి వెళ్లాడు. తిరిగి రాత్రి తన ఇంటికి వచ్చి వరండాలో నిద్రపోయాడు. 11 గంటల సమయంలో భార్య నిద్ర లేపేందుకు ప్రయత్నించింది. అయితే అతని నుంచి స్పందన లేకపోవడంతో బంధువులకు సమాచారం ఇచ్చింది. 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరీక్షించగా మృతిచెందినట్లు నిర్ధారించారు. మల్లేశ్వరి తన తమ్ముడి మృతిపై అనుమానాలున్నటు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేశారు.
సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
● జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్
అంతర్ సింగ్ ఆర్య
నెల్లూరు(పొగతోట): గిరిజనులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య అన్నారు. గురువారం నెల్లూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గిరిజనులు, ఆదివాసీల సమస్యల పరిష్కారం విషయంలో నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనివ్వనని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏకలవ్య విద్యాలయాల స్థాపనకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశామన్నారు. గిరిజనుల సమస్యలను నేరుగా లేదా ఈ – మెయిల్ ద్వారా కమిషన్ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేలా చర్యలు చేపడతామన్నారు. వచ్చే నెలలో ఏపీలో గిరిజనుల సమస్యలు, బడ్జెట్ వినియోగంపై ప్రత్యేక సమావేశం జరుగుతుందన్నారు. ఎస్టీల అభివృద్ధికి కేంద్రం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఉదయగిరి, కోవూరు, సర్వేపల్లి ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎస్టీల సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. తొలుత ఐటీడీఏ పీఓ శ్రీనివాసరావు తమ పరిధిలో జరిగే కార్యక్రమాలను వివరించారు. ఎన్జీఓలు, గిరిజనుల సంక్షేమ సంఘం నాయకులు సమస్యలను చైర్మన్‌కు వివరించారు. సమావేశంలో ఎస్పీ అజిత, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


