● మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
కావలి: జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి వ్యతిరేకంగా శుక్రవారం జరిగే చలో జువ్వలదిన్నె కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కోరారు. కావలిలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు 70 ఎకరాల స్థలాన్ని సేకరించి అభివృద్ధి చేశారన్నారు. 29.5 ఎకరాల భూమిని ప్రైవేట్ సంస్థ అయిన సాగర్ డిఫెన్స్ సంస్థకు అప్పజెప్పడం మంచి పద్ధతి కాదన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు తాము, తమ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. వారికి స్థలాన్ని వేరేచోట ఇచ్చి స్థానిక ప్రజలకు ఉపాధి కల్పిస్తే మంచిదన్నారు. కానీ హార్బర్ కోసం సేకరించిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. శుక్రవారం కావలి వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి చలో జువ్వలదిన్నె కార్యక్రమం జరుగుతుందన్నారు. దీనికి పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నాయకులు విచ్చేస్తారన్నారు. తీర ప్రాంత ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రూరల్ మండల అధ్యక్షుడు వాయిల తిరుపతి, సీఆర్‌పాళెం సర్పంచ్ గిరిబాబు, జువ్వలదిన్నె సర్పంచ్ గోవిందస్వామి, అన్నగారిపాళెం ఎంపీటీసీ సభ్యులు పి.శ్రీనివాసులు, గంగన్నగారి యోధశ్రీ, పెద్దపట్టపుపాళెం ఎంపీటీసీ వాయిల రాధాకృష్ణ, వెంకట్రావు, పౌలు తదితరులు పాల్గొన్నారు.


