● రోడ్డుపై పడిపోయిన శీతల పానీయాలు
● నిమిషాల వ్యవధిలో ఎత్తుకెళ్లిన స్థానికులు
నెల్లూరు(క్రైమ్): కూల్‌డ్రింక్స్ లారీ బోల్తా పడిన ఘటన బుజబుజనెల్లూరు జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. సౌత్ ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు.. కూల్‌డ్రింక్స్ లోడ్‌తో లారీ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నుంచి బుచ్చిరెడ్డిపాళేనికి బయలుదేరింది. వరికోత మెషీన్‌ను చైన్నె నుంచి హైదరాబాద్ తీసుకెళ్తున్న లారీ బుజబుజనెల్లూరు వద్ద కూల్‌డ్రింక్స్ లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఢీకొంది. దీంతో కూల్‌డ్రింక్స్ లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంటూ వెళ్లి బోల్తా పడింది. ఆ లారీ డ్రైవర్, క్లీనర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. కూల్‌డ్రింక్స్ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో స్థానికులు, అటుగా వెళ్తున్న వారు నిమిషాల వ్యవధిలో బాటిళ్లను తీసుకెళ్లిపోయారు. ప్రమాద ఘటనతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. సమాచారం అందుకున్న సౌత్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాదానికి కారణమైన లారీని అదుపులోకి తీసుకున్నారు. కూల్‌డ్రింక్స్ లారీ డ్రైవర్ మోహిత్‌కుమార్ రామ్ ఫిర్యాదు మేరకు సౌత్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.


