సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
నెల్లూరు(క్రైమ్): సైబర్ నేరాలపై ప్రతిఒక్కరిలో అప్రమత్తత అవసరమని ఎస్పీ అజిత వేజెండ్ల అన్నారు. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో బుధవారం వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ పాల్గొని వాకర్స్, సీనియర్ సిటిజెన్స్‌కు పలు సూచనలు చేశారు. నేరగాళ్లు సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. యువత, మహిళలు తమ వ్యక్తిగత సమాచారం ఎవరికీ ఇవ్వరాదని, అవసరం లేని సామాజిక మాధ్యమాల వినియోగానికి దూరంగా ఉండాలన్నారు. సైబర్ మోసాలకు గురైతే 1930 లేదా సైబర్‌క్రైమ్.జీఓవి.ఇన్‌కు లేదా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అనంతరం రోడ్డుప్రమాదాల నివారణ, సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఏఎస్పీ సౌజన్య, డీఎస్పీలు ఎం.గిరిధర్, ఘట్టమనేని శ్రీనివాసరావు, ఎ.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
4,250 కేజీల రేషన్ బియ్యం పట్టివేత
మనుబోలు: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు మండల పరిధిలోని జాతీయ రహదారిపై గురివిందపూడి సమీపంలో బుధవారం స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ సీఐ కె.నరసింహారావు, విజిలెన్స్ తహసీల్దార్ కృష్ణప్రసాద్ తదితరులు ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్న తరుణంలో ఓ మినీ లారీలో అక్రమంగా తరలిస్తున్న 4,250 కేజీల బియ్యాన్ని గుర్తించి సీజ్ చేశారు. అనంతరం లారీని మనుబోలు పోలీసులకు అప్పగించారు. బియ్యం తరలిస్తున్న మురళీమోహన్, డ్రైవర్ హరీష్, వాహన యజమాని వెంకటాద్రిలపై కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో పొదలకూరు, వెంకటాచలం సీఎస్‌డీటీ రవి, సైమన్‌బాబు ఉన్నారు.
చెరువులో రెండేళ్ల చిన్నారి మృతదేహం
నెల్లూరు సిటీ: చెరువులో రెండేళ్ల చిన్నారి మృతిచెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. రూరల్ మండలంలోని ఆమంచర్లలోని అరుంధతీవాడకు చెందిన పెంచలయ్య, సావిత్రిలకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా కొంతకాలంగా సావిత్రి తన పిల్లలను పోషిస్తోంది. ఈ క్రమంలో మూడో కుమార్తె ముత్యాలమ్మ బుధవారం కనిపించకపోవడంతో ఆందోళనకు గురైంది. దీంతో సమీప ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. చెరువులోని ఓ మూలన నీటిలో పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. అప్పటికే చిన్నారి మృతిచెందింది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం


