స్కూల్ నిర్మాణంపై బ్లూ ప్రింట్ ఎక్కడ?
నెల్లూరురూరల్: ఐదెకరాల వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మించబోతున్న ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణానికి సంబంధించిన బ్లూ ప్రింట్ ఎక్కడని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి సమీర్ ఖాన్ ప్రశ్నించారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. అక్కడ స్కూల్ నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదని, సీఎస్సార్ ఫండ్స్‌తో నిర్మిస్తే దానిని ఎవరు నడుపుతారని ప్రశ్నించారు. ఈనెల 4న శంకుస్థాపన చేసే స్కూల్‌కు బ్లూ ప్రింట్ అడిగితే అధికారులు మాకు తెలియదని చెప్పడం ఆశ్చర్యకరమని, అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్‌తో నడుస్తోందని, ప్రస్తుతం సెంట్రల్‌తో ఉన్న మీరు బాధ్యత కూడా కేంద్రం తీసుకునే విధంగా చేయాలన్నారు. మంత్రి నారాయణ ఎప్పుడూ శంకుస్థాపన చేసి వెళ్తాడని, కట్టేది మాత్రం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ గోషామహల్ హాస్పిటల్, షాదీ మహల్ అని తెలిపారు. ఇన్‌చార్జి మేయర్ రూప్‌కుమార్ యాదవ్ ఎమ్మెల్సీకి ఏమీ తెలియదని అంటున్నారని, ఆయనకు మీలా క్యాంపు రాజకీయాలు, ప్రజలను మభ్య పెట్టడం, మీలా బరితెగించడం నిజంగా తెలియదన్నారు. ముందు మీరు బాగా మాట్లాడడం నేర్చుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు షేక్ సిద్ధీఖ్, పార్టీ మైనార్టీ సెల్ నగర నియోజకవర్గ అధ్యక్షుడు షేక్.అబ్దుల్ మస్తాన్, సీనియర్ నాయకుడు జియా ఉల్‌హక్ తదితరులు పాల్గొన్నారు.


