పింఛన్ ఇప్పించండయ్యా..
తొమ్మిది గంటలకు పిలిచి.. 10 గంటలకు పంపిణీ
● అవస్థలు పడిన వృద్ధులు,
దివ్యాంగులు
ఆత్మకూరు: పింఛన్ల పంపిణీని టీడీపీ నేతలు మెహర్భానీకి వినియోగించుకున్నారు. అధికారులు పంపిణీ చేయాల్సిన పింఛన్లను స్థానిక టీడీపీ నేతలు ప్రచార ఆర్భాటాలకు పోయి లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దివ్యాంగులు, వృద్ధులను గ్రామంలో ప్రాథమిక పాఠశాల వద్దకు, రచ్చబండ వద్దకు పిలిపించి నిరీక్షించేలా చేసి టీడీపీ చోటా నాయకులు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలం యనమదల గ్రామంలో స్థానిక టీడీపీ నాయకుడు వెంకట రమణారెడ్డి గిరిజనులను, వృద్ధులను గ్రామ రచ్చబండ వద్దకు పిలిచి ఆయన చేతుల మీదుగా పింఛన్లను మెహర్భాని ప్రదర్శిస్తూ పంపిణీ చేశారు. అదే క్రమంలో గొల్లపల్లి గ్రామంలో స్థానిక టీడీపీ నాయకుడు ఉడతా హజరత్తయ్య సైతం గ్రామ పాఠశాల వద్దకు పింఛన్‌దారులను ఉదయం తొమ్మిది గంటలకు పిలిపించారు. అందరూ ఒకచోట చేరిన తర్వాత 10 గంటలకు ఒకేసారి పింఛన్ అందజేశారు. సచివాలయ ఉద్యోగులు సైతం ఆయా గ్రామాల్లో టీడీపీ నాయకులు చెప్పినట్లే చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గత వైఎస్సార్‌సీపీ పాలనలో సామాజిక పింఛన్లను తెల్లవారుజామున 5 గంటల నుంచే వలంటీర్లు ఇళ్ల వద్దకు వచ్చి ఇచ్చేవారని వృద్ధులు, దివ్యాంగులు గుర్తు చేసుకుంటున్నారు.
● ఎమ్మెల్యేను వేడుకున్న వృద్ధురాలు
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండలం ఊటుకూరు పంచాయతీ తక్కెళ్లపాడు ఎస్సీ కాలనీలో పెంచలమ్మ అనే వృద్ధురాలు తనకు పింఛను ఇప్పించాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను బుధవారం వేడుకుంది. రెండేళ్ల క్రితం తన భర్త పింఛన్ పొందుతూ చనిపోయాడని, ఆయన స్థానంలో తనకు పింఛన్ ఇప్పించాలని అధికారులను కోరుతున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అదేవిధంగా మరికొంత మంది దివ్యాంగులు, వృద్ధులు తమకు కూడా పింఛన్ రాలేదని, పింఛన్ కోసం ఎమ్మెల్యే ఎదుట వాపోయారు. దీంతో పాటు గ్రామంలో వాటర్ ప్లాంట్ చెడిపోయినా పట్టించుకోవడం లేదని, నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కాలనీలో సీసీరోడ్డు లేనందున త్వరలో జరిగే పంచాయతీ స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడిగే పరిస్థితి కూడా లేదని, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
పింఛన్ ఇప్పించండయ్యా..


