చర్చ లేకుండానే నిర్ణయాలు
● కమిషనర్ చర్యలకు
తగిన మూల్యం తప్పదు
● ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ
పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి
నెల్లూరు(బారకాసు): కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం అధికార పార్టీ నిర్ణయాలకు మాత్రమే పరిమితమైందని, అజెండాలోని ఏ అంశంపై కూడా చర్చ లేకుండా నేరుగా నిర్ణయాలు తీసుకున్నారని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నుంచి బయటికి వచ్చిన అనంతరం ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఎక్కడా ప్రజా సమస్యలను చర్చించేందుకు తావులేకుండా చేశారని మండిపడ్డారు. వీఆర్ హైస్కూల్లో అడ్మిషన్లలు మంత్రి నారాయణకు సంబంధించిన ఎన్‌టీమ్ వారే చేపడుతున్నారని ప్రశ్నిస్తే, సీఎస్సార్ ఫండ్స్‌తో అభివృద్ధి చేశామని దాటవేసే విధంగా సమాధానం ఇస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు కింద రాష్ట్రంలో 43 వేల ప్రభుత్వ పాఠశాలను ఆధునికీకరించి వసతులు సమకూర్చామన్నారు. ఆ పనులు పారదర్శక విధానంలో నిర్వహించి అడ్మిషన్లను ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరిపామన్నారు. మంత్రి నారాయణ ఏకపక్షంగా వీఆర్‌ఐ స్కూల్లో అడ్మిషన్ నిర్వహిస్తూ.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. నగరపాలక సంస్థ కమిషనర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఎక్స్ అఫీషీయో మెంబర్ హోదాలో ప్రజా సమస్యలపై పలుమార్లు లేఖలు రాస్తే కనీసం సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా లేరన్నారు. ఆయన చేస్తున్న తప్పులకు చట్టం పరిధిలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. 13వ డివిజన్‌లో ఒక సెంటు కంటే చిన్న స్థలంలో నివాసం ఉంటున్న దళిత మహిళ ఇంటి బాత్ రూమ్‌ను దయ లేకుండా కమిషనర్ దగ్గరుండి కూల్చి వేయించారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 46వ డివిజన్లో నిర్మించిన ఓ వాటర్‌ప్లాంట్‌ను నిర్వీర్యం చేశారని, దానిపై ఫిర్యాదు చేసినా కమిషనర్ స్పందన లేదన్నారు. అధికార పార్టీకి తొత్తుగా కమిషనర్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త తరలింపు విషయంలో ట్రాక్టర్లను ఏర్పాటు చేసి వాటికి రూ.11 కోట్లు చెల్లిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు.


