పెరిగిన నేర శాతం
నెల్లూరు(క్రైమ్): గతేడాదితో పోలిస్తే జిల్లాలో ఈ సంవత్సరం నేరాల సంఖ్య 7.55 శాతం మేర పెరిగింది. హత్యలు, హత్యాయత్నాలు, మర్డర్ ఫర్ గెయిన్ లాంటి క్రైమ్‌లు తగ్గినా, ఆస్తి, వైట్ కాలర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరిగాయి. నేరాల అదుపునకు పోలీస్ శాఖ సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నా, ఆగడాలకు అడ్డుకట్ట ఏ మాత్రం పడటం లేదు.
రూ.23.57 కోట్లు కొల్లగొట్టారు..
సాంకేతికతను అడ్డంపెట్టుకొని సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. ఆన్‌లైన్ ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్ తదితరాల పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. గతేడాది 85 కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం ఇది 101కు ఎగబాకింది. గతేడాది రూ.15,02,26,000ను దోచు కోగా, ఈ ఏడాది ఇది రూ.23,57,97,426కు చేరింది. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు రూ.1,07,71,858 మేర రికవరీ చేసి నేరగాళ్ల బ్యాంక్ ఖాతాల్లోని నగదును స్తంభింపజేశారు.
రక్తమోడిన రహదారులు
రహదారి ప్రమాదాలు సైతం పెరిగాయి. వాహనదారుల నిర్లక్ష్యం, మితిమీరిన వేగం, డ్రంకెన్ డ్రైవ్, పరిమితికి మించిన రాకపోకలు.. ఇలా కారణాలు ఏదైనా రహదారులు రక్తమోడాయి. గతేడాది 843 ప్రమాదాలు జరగ్గా, ఈ ఏడాది 928 చోటుచేసుకున్నాయి. 514 మంది మృతి చెందగా, 894 మంది క్షతగాత్రులయ్యారు.
చెలరేగిన చోరులు
దొంగలు చెలరేగిపోయారు. గతేడాది 816 చోరీలు జరగ్గా, ఈ ఏడాది 899 నమోదయ్యాయి. పగలు, రాత్రనే తేడా లేకుండా తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించి రూ.14,72,67,725ను కొల్లగొట్టారు. 511 కేసులకు సంబంధించి రూ 6,47,85,374ను మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు.
గుప్పుమంటున్న గంజాయి
జిల్లాలో గంజాయి, మద్యం అక్రమ రవాణా, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. 34 కేసులను నమోదు చేసి 510 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 102 మందిని కటకటాల వెనక్కి పంపి, 14 వాహనాలను సీజ్ చేశారు. మద్యానికి సంబంధించి 55 కేసులను నమోదు చేసి, 58 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 123 లీటర్లను స్వాధీనం చేసుకున్నారు. లింగసముద్రం పరిఽధిలో 50 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
సంచలనం రేకెత్తించిన హత్యలు
జిల్లాలో పలు హత్య కేసులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. గతేడాది 45 మర్డర్లు జరగ్గా, ఈ ఏడాది 39 సంభవించాయి. వీటిలో అధిక శాతం హత్యలు నగరంలోనే నమోదయ్యాయి. మర్డర్ ఫర్ గెయిన్ కింద ఎనిమిది కేసులు గతేడాది నమోదు కాగా, ఈ ఏడాది ఐదు.. కొట్లాట కేసులు 1032 నమోదు కాగా, ఈ సంవత్సరం 1017 రికార్డయ్యాయి.
ప్రమాదాల కట్టడికి చర్యలు
జిల్లా వ్యాప్తంగా 33 బ్లాక్ స్పాట్లను గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వాహన తనిఖీలను ముమ్మరం చేసింది. నిబంధనల ఉల్లంఘనలపై 51,093 ఈ చలానాల ద్వారా రూ. 2,62,13,990 అపరాధ రుసుమును విధించారు. హెల్మెట్ ధరించని వారిపై 14,663.. ఓవర్ స్పీడ్‌పై 4262, డ్రంకెన్ డ్రైవ్‌పై 4741 కేసులను నమోదు చేశారు.
పీడీ యాక్ట్‌ల నమోదు
జిల్లాలో తీరుమారని 16 మంది రౌడీషీటర్లపై పీడీ యాక్ట్‌లను నమోదు చేశారు. మరో తొమ్మిది మందిపై త్వరలోనే అమలు చేయనున్నారు. గంజాయి కేసుల్లో పట్టుబడిన 17 మందిపై నమోదుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. పోక్సో, హత్య తదితర కేసుల్లో 25 మందికి జైలు శిక్షలు పడ్డాయి.
వార్షిక నేర నివేదిక విడుదల
2025కు సంబంధించిన వార్షిక నేర నివేదికను నగరంలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ అజిత వేజెండ్ల బుధవారం విడుదల చేశారు. గతేడాది 4381 కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం 4712 రికార్డయ్యాయని వివరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 4521 అర్జీలు రాగా, వాటిలో 4396ను పరిష్కరించామని చెప్పారు. 1140 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించామన్నారు. 2026లో మెరు గైన శాంతిభద్రతలను అందిస్తామని తెలిపారు. జిల్లా ప్రజలు, పోలీస్ అఽధికారులు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. జిల్లాలో ఉత్త మ ప్రతిభ కనబర్చిచిన పోలీసులకు రివార్డులను అందజేశారు. ఏఎస్పీ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
వార్షిక నివేదికను వెల్లడిస్తున్న ఎస్పీ అజిత
గతేడాదితో పోలిస్తే
7.55 మేర అదనం
పంజా విసిరిన సైబర్ నేరగాళ్లు
16 మంది రౌడీషీటర్లపై పీడీ యాక్ట్‌లు


