రైతులను అడ్డుపెట్టుకొని దోచుకోవడం దుర్మార్గం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
వెంకటాచలం: రైతులను అడ్డుపెట్టుకొని ఇరిగేషన్ పనుల్లో సోమిరెడ్డి దోచుకోవడం దుర్మార్గమని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. మండలంలోని ఇస్కపాళెంలో బుధవారం పర్యటించిన ఆయన మాట్లాడారు. టీడీపీ పాలనలో అవినీతి తప్ప, అభివృద్ధి కానరావడంలేదని విమర్శించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో దోపిడీ సర్వసాధారణమైపోయిందని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రజాబలం లేకపోవడంతో పోలీసులపై ఆధారపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్ పనుల్లో రైతులను అడ్డుపెట్టుకొని దోపిడీకి పాల్పడటంతో వారు ఛీ కొడుతున్నారని చెప్పారు. ఇందులో ఇప్పటికే రూ.100 కోట్ల దోపిడీకి పాల్పడి, తాజాగా మోంథా తుఫాన్ పేరిట మరో రూ.19.70 కోట్లను కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ, ప్రజల ఆస్తులతో పాటు రైల్వే శాఖకు చెందిన ఆస్తులకూ రక్షణ లేకపోవడం ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే జరుగుతోందని చెప్పారు. యూరియాను బ్లాక్ మార్కెట్లో విక్రయించడాన్ని రైతులు గమనిస్తున్నారని చెప్పారు. కాకుటూరు శివాలయ భూములను సైతం విక్రయించడాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారని, భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. గ్రావెల్, ఇసుక అక్రమ రవాణా ఎక్కడా లేని విధంగా జరుగుతోందన్నారు. ప్రభుత్వం మారిన వెంటనే ఇక్కడ జరిగిన అవినీతిపై విచారణ.. ఎలాంటి చర్యలు తీసుకుంటామో ప్రజలే చూస్తారని స్పష్టం చేశారు.


