జిల్లా అభివృద్ధే ప్రధాన లక్ష్యం
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లా అభివృద్ధే లక్ష్యంగా కీలక రంగాల్లో సమగ్ర చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్‌తో కలిసి బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగంలో చాంపియన్ ఫార్మర్ అనే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చామని చెప్పారు. వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను రైతులు తెలుసుకునేలా చర్యలను చేపట్టడంతో పాటు వాట్సాప్ నంబర్లను సైతం అందుబాటులో ఉంచామని వెల్లడించారు.
ఫిర్యాదుల పరిష్కారంలో ఏడో స్థానంలో..
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా అర్జీల క్లియరెన్స్‌లో రాష్ట్రంలో జిల్లా ఏడో స్థానంలో ఉందని చెప్పారు. వచ్చే నెల నుంచి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నామని వెల్లడించారు. దగదర్తి వద్ద ఏర్పాటు చేయనున్న గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ఇండోసోల్ పరిశ్రమ స్థాపనకు 1200 ఎకరాలను సేకరించామని పేర్కొన్నారు. బీపీసీఎల్ సంస్థ ఏర్పాటుకు గానూ ఆరు వేల ఎకరాలను సేకరించగా, ఇందులో మూడు వేలు కందుకూరుకు సంబంధించినవన్నారు. మరో మూడు వేలు కావలి డివిజన్లోని రెండు గ్రామాల్లో ఉన్నాయని తెలిపారు. మార్చి నాటికి వీటిని సంస్థకు అప్పగించనున్నామని ప్రకటించారు. ఉగాది నాటికి అందరికీ ఇల్లులందేలా కృషి చేయనున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేసి డైరీలను అందజేశారు.


