అధికారుల తీరుతో గౌరవం లభించడంలేదు
● పలు అంశాలను ప్రస్తావించిన ఎమ్మెల్సీ
చంద్రశేఖర్‌రెడ్డి, కార్పొరేటర్లు
● కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఆల్ పాస్
నెల్లూరు(బారకాసు): డివిజన్లలో జరిగే అభివృద్ధి పనుల విషయంలో తమకెలాంటి సమాచారం లేకుండా కార్పొరేషన్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజల్లో గౌరవం లేకుండాపోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని అబ్దుల్ కలామ్ సమావేశ మందిరంలో ఇన్‌చార్జి మేయర్ రూప్‌కుమార్‌యాదవ్ అధ్యక్షతన కౌన్సిల్ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పది మంది.. టీడీపీకి చెందిన 40 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. 118 మెయిన్.. 53 సప్లిమెంటరీ.. టేబుల్ అజెండాలుగా 16.. ఇలా మొత్తం 187 తీర్మానాలను కౌన్సిల్ ఆమోదించింది.
లేఖలు రాసినా స్పందనేదీ..?
గత మేయర్ స్రవంతి హయాంలో సమావేశాలను పక్కాగా నిర్వహించారని, రానున్న రోజుల్లోనూ ఇదే తరహాలో జరగాలని ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి కాంక్షించారు. కమిషనర్‌తో పాటు ఇతర అధికారులకు ఫోన్ చేసినా, స్పందించడంలేదని ఈ విషయమై అధిక శాతం మంది కార్పొరేటర్లు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. వీఆర్ మున్సిపల్ హైస్కూల్‌కు సంబంధించిన విషయాలను తెలియజేయాలని కమిషనర్‌కు పలుమార్లు లేఖలు రాసినా స్పందన లేదన్నారు. 43వ డివిజన్‌కు సంబంధించిన ఓటరు జాబితాను కోరినా, సమాధానం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్‌ను ఎందుకు పాటించడంలేదని ప్రశ్నించారు. ఆక్రమణకు గురైన 12 కాలువలను వెడల్పు చేసేందుకు గానూ అడ్డంకిగా ఉన్న 2500 ఇళ్లను తొలగించాలనే నిర్ణయంపై బాధితుల్లో ఆందోళన నెలకొందన్నారు. వీఆర్ హైస్కూల్లో అడ్మిషన్లెలా జరుగుతున్నాయనే విషయాలను ఇన్‌చార్జి మేయర్ ద్వారా అధికారులు తెలియజేయాలని కోరారు.
గ్రాంట్‌ను ఎందుకు తీసుకురాలేకపోయారు..?
భూగర్భ డ్రైనేజీ పనులు ఎప్పటికి పూర్తవుతాయని 21వ డివిజన్ కార్పొరేటర్ మొయిళ్ల గౌరి ప్రశ్నించారు. తాగునీటి కుళాయి కనెక్షన్లను ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. వీటికి హడ్కో నుంచి రూ.993 కోట్ల రుణాన్ని పొందారని, దీనికి గానూ అసలు.. వడ్డీకి కలిపి కార్పొరేషన్ ఏటా రూ.150 కోట్లను చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఉండి కూడా గ్రాంట్‌ను ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే తీరును తప్పుబడితే నేరమా..?
గతంలో సమ్మె చేపట్టిన సమయంలో పారిశుధ్య కార్మికులకు జీతాలను ఇప్పిస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హామీ ఇచ్చారని, అయితే సమస్య నేటికీ పరిష్కారం కాలేదని గౌరి తెలియజేశారు. దీంతో కొందరు టీడీపీ కార్పొరేటర్లు లేచి శాసనసభ్యుడ్ని తప్పుబడతారానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇన్‌చార్జి మేయర్ కలగజేసుకున్నారు. కార్పొరేటర్లు ఊటుకూరు నాగార్జున, వేలూరి ఉమామహేష్, సత్తార్, కామాక్షి, డిప్యూటీ మేయర్ తహసీన్, కో ఆప్షన్ సభ్యులు జమీర్, వహీదా, కమిషనర్ నందన్ తదితరులు పాల్గొన్నారు.


