పొట్టకూటి కోసం.. రాష్ట్రాలు దాటి..
● మధ్యప్రదేశ్ నుంచి రాక
● ఊరూరా వ్యవసాయ
పరికరాల విక్రయం
● రోడ్లపైనే తయారీ
సీతారామపురం: బతుకుదెరువు కోసం కొన్ని కుటుంబాలు రాష్ట్రాలు దాటి పల్లెసీమలకు వలస వస్తున్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన కొందరు ఊరూరా తిరుగుతూ వ్యవసాయ పరికరాలు విక్రయిస్తూ బతుకు పోరాటం సాగిస్తున్నారు. వ్యవసాయ పనుల్లో నిత్యం ఉపయోగించే కత్తి, గొడ్డలి, గుణపం, కొడవలి తదితర పనిముట్లతోపాటు ఇంట్లో వాడే కత్తిపీటలను వాసులు తయారు చేస్తున్నారు. ఆ రాష్ట్రంలోని భోపాల్, సాగర్ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు పదుల సంఖ్యలో కుటుంబాలు ఈ పనుల కోసం మన రాష్ట్రంలోని పల్లె ప్రాంతాలకు వచ్చాయి. వీరంతా రహదారి పక్కనే తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని వ్యవసాయ పరికరాలు తయారు చేసి అమ్ముతున్నారు. వస్తువులకు ఉన్న డిమాండ్‌ను బట్టి రెండు, మూడు రోజులు అక్కడే ఉంటున్నారు. ఆ తర్వాత మరో ఊరికి వలస వెళ్తున్నారు.
కళ్లెదుటే తయారీ
మధ్యప్రదేశ్‌కు చెందిన వలస జీవులు తమతో తీసుకొచ్చిన ఇనుప రాడ్లను రైతుల ముందే కొలిమిలో కాల్చి వారు కోరిన విధంగా పనిముట్లను తయారు చేయడం విశేషం. ఒక్కో పనిముట్టును దాని బరువు ఆధారంగా రూ.100 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. ఇలాంటివి స్థానికంగా దుకాణాల్లోనూ లభిస్తాయి. కానీ నాణ్యత బాగోదని రైతులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన వీరందరూ ఏడాదిలో దాదాపు పది మాసాలపాటు ఇతర రాష్ట్రాల్లో తిరుగుతారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌లోని పలు గ్రామాలకు వెళ్తుంటారు. నవంబర్ నెల నుంచి మన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తిరుగుతున్నారు.
కుటుంబం మొత్తం
వ్యవసాయ పరికరాల తయారీలో పురుషులతోపాటు మహిళలు, బాలలు శ్రమిస్తున్నారు. ఇనుమును కటింగ్ చేసే సమయంలో మగవారితో సమానంగా మహిళలు సమ్మెట దెబ్బలు వేస్తున్నారు. కొలిమిని మండించడం, తయారు చేసిన వస్తువులను విక్రయించడం వంటి పనులు చేస్తున్నారు. అయితే తల్లిదండ్రులతోపాటే వలస జీవితం సాగించే చిన్నారులు పూర్తిగా చదువుకు దూరమయ్యారు. పదేళ్ల వయసున్న వారు సైతం పనిముట్ల తయారీలో పెద్దవారికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. పాఠశాలకు పంపడం లేదా అని ఎవరైనా ప్రశ్నిస్తే ముందు పొట్ట నిండాలి కదా అని తల్లిదండ్రులు సమాధానమిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల పరిసర ప్రాంతాల్లో టెంట్లు వేసుకుని తాము జీవనం సాగిస్తున్నామని తమకు నిలువ నీడ లేదని చెబుతున్నారు.
ఏటా వలస బాట
జీవనోపాధి కోసం ఏటా వలస వచ్చేస్తాం. దాదాపు పదినెలలపాటు గ్రామాల్లో తిరుగుతూ బయట ప్రాంతాల్లో గడుపుతాం. అన్ని ప్రాంతాల్లో వ్యవసాయ పనిముట్లను తయారు చేసి అమ్మకాలు సాగిస్తుంటాం. చలైనా, ఎండైనా పూట గడవడానికి పాట్లు తప్పవు. రైతులు మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారు. రహదారి పక్కనే జీవిస్తున్న సమయంలో కొన్నిచోట్ల ప్రమాదాలకు కూడా గురవుతుంటాం.
– సర్దార్ సింగ్, వలస కార్మికుడు, మధ్యప్రదేశ్
పరికరాలు బాగున్నాయి
మధ్యప్రదేశ్ వాసులు తయారు చేస్తున్న వ్యవసాయ పరికరాలు చాలా బాగున్నాయి. మా కళ్లెదుటే నాణ్యతగా తయారు చేస్తున్నారు. దీంతో మాకు నచ్చిన విధంగా వాటిని తయారు చేయించుకుంటున్నాం. వీరి పనిముట్లను గ్రామాల్లోని రైతులందరూ కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు జోరందుకుంటున్న నేపథ్యంలో పనిముట్లకు డిమాండ్ ఏర్పడింది.
– చెన్నుబోయిన రమణయ్య,
రైతు, పోకలవారిపల్లి
పొట్టకూటి కోసం.. రాష్ట్రాలు దాటి..
పొట్టకూటి కోసం.. రాష్ట్రాలు దాటి..
పొట్టకూటి కోసం.. రాష్ట్రాలు దాటి..


