చికెన్ వ్యర్థాలు తరలిస్తుండగా..
● మినీవాన్ల పట్టివేత
సంగం: మండల పరిధిలోని రాంపు సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న రెండు చికెన్ వ్యర్థాల వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ వ్యర్థాలను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్సై రాజేష్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. రెండు మినీవ్యాన్‌లు నిలిపి పరిశీలించి అందులో 31 డ్రమ్ముల వ్యర్థాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాహనాలను సీజ్ చేశారు. కేసు నమోదు చేశారు.
నెల్లూరు జిల్లాలోనే
కొనసాగించాలని కోరాం
● మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు(దర్గామిట్ట): రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని సీఎం చంద్రబాబు, రెవెన్యూ శాఖ మంత్రి, కలెక్టర్‌ను కోరినట్లు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. విభజన నోటిఫికేషన్ కు సంబంధించి అభ్యంతరాలు తెలియజేయడానికి శుక్రవారం ఆఖరిరోజు కావడంతో ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూడు మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని, అలాగే ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌లో కలపాలని సీఎంకు విన్నవించానన్నారు. ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రకు విజ్ఞాపన పత్రాన్ని అందజేశానని తెలిపారు.
వైభవంగా క్షేత్రోత్సవం
రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో గోదాదేవికి ప్రత్యేక పూజలు, క్షేత్రోత్సవం నిర్వహించారు. ధనుర్మాసం పురస్కరించుకుని గోదాదేవికి నాలుగు శుక్రవారాలు క్షేత్రోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా రెండో శుక్రవారం గోదాదేవి ఉత్సవ విగ్రహాన్ని తిరుచ్చిపై కొలువుదీర్చారు. వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి కోన వీధుల్లో ఊరేగించారు. ఉదయం 5 గంటలకు పెనుశిల లక్ష్మీనరసింహస్వామికి తిరుప్పావై, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చికెన్ వ్యర్థాలు తరలిస్తుండగా..
చికెన్ వ్యర్థాలు తరలిస్తుండగా..


