పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం
● సీపీఐ జిల్లా కార్యదర్శి నాగేంద్రసాయి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీపీపీ విధానంతో పేద, మద్య తరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారని సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి అన్నారు. ఆ పార్టీ శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం నెల్లూరులోని సంతపేటలో ఉన్న జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం కోసం సీపీఐ పోరాటాలు చేస్తోందన్నారు. జనవరి 18వ తేదీ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో నిర్వహించే శత జయంతి ముగింపు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు తరలివస్తారన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి వీబీ–జీ రాం జీ చట్టాన్ని తీసుకురావడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉఫాది హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు వ్యక్తులకు అప్పజెబుతోందని, దీంతో పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ విధానంపై రాజకీయ పార్టీలు నిరసనలు, అభ్యంతరాలు తెలిపినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. పీపీపీ విధానాన్ని రద్దు చేసేంత వరకు సీపీఐ పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ నగర సహాయ కార్యదర్శి సిరాజ్, నాయకులు రామరాజు, రమణయ్య, మాలకొండయ్య, వినోదిని, శంకర్ కిశోర్, మున్నా, జిలానీఖాన్, అజీజ్, వనజ, సోఫియా, జ్యోతి పాల్గొన్నారు.


