స్కిల్ సెంటర్ ఏర్పాటుకు వినతి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరు నగరంలోని గాంధీ నగర్‌లో ఉన్న 6.90 ఎకరాల్లో చేనేత బజార్, చేనేతలకు స్కిల్ సెంటర్, కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు వీఎన్ మాధవ్‌ను జిల్లా చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు కోరారు. విజయవాడలో ఆ పార్టీ కార్యాలయంలో శుక్రవారం కమిటీ జిల్లా అధ్యక్షుడు బుధవరపు బాలాజీ, వర్కింగ్ ప్రెసిడెంట్ సోమ గోపాల్, ఉపాధక్షులు చింతలగింజల సుబ్రహ్మణ్యం, జానపాటి రామసుబ్బయ్య కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేతలకు సహకారం అందించడం వల్ల 3,800 కుటుంబాలు, అనుబంధ వృత్తులపై ఆధారపడిన ఐదువేల కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్మికులకు ఆధునిక నైపుణ్యం అందుబాటులోకి వస్తుందన్నారు. గాంధీ నగర్‌లో చేనేతలకు కేటాయించిన స్థలాన్ని ఉపయోగంలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగ్గారపు శ్రీనివాసరావు, బండారు బెనర్జీ, సింగరి లక్ష్మీనారాయణ, మునగపాటి వెంకటేశ్వరరావు, చిలుకోటి అంజిబాబు, మునగాల గిరిధర్, పెండం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


