టీడీపీలో బీదకు ఘోర పరాభవం
● జిల్లా టీడీపీ పగ్గాలు చేపట్టిన
బీసీ నేతపై పక్షపాతం
● అభినందనలు చెబుతూ
అభిమానులు భారీగా ఫ్లెక్సీల ఏర్పాటు
● వెంటనే కార్పొరేషన్ అధికారులు
తొలగింపు
● ఓ కార్పొరేటర్ భర్త ఫ్లెక్సీలను వదిలేసి బీదవి మాత్రమే తీయడంపై దుమారం
● నగర కమిషనర్ చర్యల
వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు?
జిల్లా టీడీపీలో ఫ్లెక్సీల ప్రకంపనలు సృష్టిస్తుండగా రాజకీయ చర్చలకు దారి
తీసింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎంపికై న బీద రవిచంద్రకు అభినందనలు తెలుపుతూ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మాత్రమే కార్పొరేషన్
అధికారులు తొలగించడంతో రాజకీయ దుమారం రేగుతోంది. మరోవైపు ఓ
కార్పొరేటర్ భర్తకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వదిలేసి కేవలం బీద ఫ్లెక్సీలనే తొలగించడం, ఈ చర్య వెనుక ఉన్న
అదృశ్య శక్తి ఎవరనేది రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా తమది బీసీల పక్షపాతి పార్టీ అంటూ చెప్పుకునే పార్టీకి జిల్లా
అధ్యక్షుడిగా ఎంపికైన బీసీ నేతకు ఘోర అవమానంగా ఆ సామాజిక వర్గాలు గరంగరమంటున్నాయి.
తొలగించిన బీద ఫ్లెక్సీలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: బీసీల పక్షపాతి పార్టీ అంటూ గొప్పలు చెప్పుకునే అధికార టీడీపీలో ఓ బీసీ నేతకు ఘోర పరాభవం ఎదురైంది. ఆ పార్టీలో రాష్ట్ర స్థాయిలో బీసీ నేతగా ప్రత్యేక గుర్తింపు ఉన్న బీద రవిచంద్రకు సొంత జిల్లాలోనే అవమానం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో బీద రవిచంద్ర నెల్లూరుకు వస్తున్న నేపథ్యంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. జిల్లా అధ్యక్ష పదవి రేస్‌లో పోటీ పడి చివరకు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పదవి దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి నుంచి మంగళవారం నెల్లూరుకు చేరుకుంటున్న నేపథ్యంలో స్వాగతం, అభినందలు తెలుపుతూ బీద అభిమానులు నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే గంటల వ్యవధిలోనే ఆయా ఫ్లెక్సీలను నగర కార్పొరేషన్ సిబ్బంది తొలగించడం పెద్ద దుమారం రేపింది. బీసీ నేత ఫ్లెక్సీల తొలగింపు వెనుక ఏదో కుట్ర రాజకీయం జరుగుతుందని బీద అభిమానులు భగ్గుమంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడి ఫ్లెక్సీలు తొలగించే సాహసం కమిషనర్ చేయగలడా? అంటే అది సాధ్యం కాదు. కానీ ఈ చర్య వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరనే విషయమై రాజకీయంగా రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై అధికార పార్టీలోని బీసీ సామాజిక వర్గం సైతం మండి పడుతోంది. బీసీ నేతకు జిల్లా పార్టీ పగ్గాలు ఇస్తే ఇలా అవమానిస్తారా? అంటూ రగిలిపోతున్నారు.
అసమ్మతి రాగం.. ఆధిపత్యం
టీడీపీలో అసమ్మతి రాగంతోపాటు ఆధిపత్యం మితిమీరింది. పార్టీ అధికారంలో లేనప్పుడు మైనార్టీ నేతగా ఉన్న అబ్దుల్ అజీజ్‌ను జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. అధికారం వచ్చాక వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి కట్టబెట్టి పార్టీలో ఆయన ఆధిపత్యాన్ని తగ్గించారు. తాజాగా కొత్తగా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ప్రారంభయ్యాక జిల్లా పార్టీ పగ్గాల కోసం మంత్రులు, ఎమ్మెల్యేల కీలక అనుచరులు పోటీ పడ్డారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సోదరుడు గిరిధర్‌రెడ్డి, మంత్రి నారాయణ కీలక అనుచరుడు వేమిరెడ్డి పట్టాభి, చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, అబ్దుల్ అజీజ్ ఎవరి స్థాయిలో వారు పైరవీలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ వారికే ఇప్పించేందుకు చేయని ప్రయత్నం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నెల్లూరు జిల్లా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. శాంతి భద్రతలు క్షీణించాయి. మహిళలే కాదు పురుషులు సైతం బయట తిరిగేందుకు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు పెచ్చుమీరాయి. పార్టీ జెండా మోసిన కింది స్థాయి కార్యకర్తలు, నేతలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. దీంతో పార్టీ పరిస్థితి నానాటికి దిగజారిపోతున్న క్రమంలో పార్టీకి వీరవిధేయుడు, అధిష్టానానికి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న రవిచంద్రకు పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించింది. జిల్లాలో పూర్తిగా బీద ఆధిపత్యమే ఉండేలా జిల్లా స్థాయి అధికార యంత్రాంగానికి ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తమ ఆధిపత్యానికి గండి పడుతుందని భావించిన అదృశ్య శక్తులు తమ వ్యతిరేకతను ఫ్లెక్సీల తొలగింపుతో చాటుకున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
నిబంధనలు బీద ఫ్లెక్సీలకేనా?
కార్పొరేషన్ పరిధిలో ఫ్లెక్సీల ఏర్పాటును గతంలో మంత్రి నారాయణ వ్యతిరేకించారు. అయితే ఎక్కడా ఆయన ఆదేశాలు అమలు చేయడం లేదు. చోటా, మోటా నేతలు విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ నేతలకు సంబంధించి చిన్న వేడుక జరిగినా నగరమంతా ఫ్లెక్సీలు రహదారులను ముంచెత్తుతున్నాయి. ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అనుచరుడు, ఓ కార్పొరేటర్ భర్త జన్మదినం సందర్భంగా నగరంలో విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వాటిని వదిలేసి, కేవలం బీదకు చెందిన ఫ్లెక్లీలనే తొలగించడం రాజకీయ చర్చలకు దారితీసింది.
టీడీపీలో బీదకు ఘోర పరాభవం
టీడీపీలో బీదకు ఘోర పరాభవం


