అధికారమే అండగా.. గ్రామకంఠం కబ్జాకు స్కెచ్
సాక్షి టాస్క్‌ఫోర్స్: దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలనే సామెతను తుచ తప్పకుండా ఆచరిస్తున్నారు కందుకూరు టీడీపీ నేతలు. కందుకూరు పట్టణ నడిబొడ్డున ఉన్న కోట్ల రూపాయల విలువైన గ్రామకంఠం భూములపై కన్నేసిన టీడీపీ బడా నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ స్థలాన్ని సొంతం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ద్వారా రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి స్థలానికి డాక్యుమెంట్లు పుట్టించేందుకు యత్నించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్డులో రాజ్ థియేటర్ వెనుకవైపున ఉన్న వడ్డిపాళెంలో రెండు చోట్ల గ్రామకంఠం స్థలం 20 సెంట్లు ఉంది. పది సెంట్ల చొప్పున రెండు ప్రాంతాల్లో ఉన్న ఈ స్థలాన్ని సొంతం చేసుకునేందుకు టీడీపీ నేతలు పథక రచన చేశారు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఆ స్థలాల విలువ రూ.3 కోట్లకుపైగా ఉంటుందని అంచనా.
తప్పుడు డాక్యుమెంట్ల కోసం ఒత్తిడి
రెవెన్యూ రికార్డుల్లో గ్రామ కంఠం కింద నమోదై ఉన్న స్థలాలకు తామే హక్కుదారులమంటూ టీడీపీ బడా నేతలు ముందుకొచ్చారు. తమ పేరు మీద డాక్యుమెంట్లు ఇవ్వాలంటూ గత 20 రోజులుగా ముఖ్య ప్రజాప్రతినిధి ద్వారా రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే అది కోట్ల రూపాయల విలువ చేసే స్థలం కావడం, రికార్డుల పరంగా గ్రామకంఠం కింద నమోదై ఉండడంతో రెవెన్యూ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. టీడీపీ నేతల ఒత్తిడికి తలొగ్గి విలువైన స్థలాన్ని వారికి కట్టబెడతారా..లేదంటే ప్రభుత్వ స్థలాన్ని కాపాడతారా అనేది త్వరలోనే తేలనుంది.
వడ్డిపాళెంలో టీడీపీ నాయకులు
కన్నేసిన మరో స్థలం
కందుకూరులోని విలువైన
స్థలాలపై టీడీపీ నేతల కన్ను
వడ్డిపాళెంలోని 20 సెంట్ల స్థలాన్ని
సొంతం చేసుకునేందుకు పావులు
హక్కుదారులమంటూ డాక్యుమెంట్ల కోసం రెవెన్యూ అధికారులపై తీవ్ర ఒత్తిడి
కాదనలేక.. కబ్జాకు సహకరించలేక అధికారుల మల్లగుల్లాలు
ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం
స్థలం విలువ రూ.3 కోట్లకు పైమాటే


