ఫ్లెక్సీలధ్వంసంతో రాజకీయ కక్షలకు ఆజ్యం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: బోగోలు మండలంలో ఫ్లెక్సీల ధ్వంసం ఘటనలు రాజకీయ కక్షలు, వివాదాలకు దారితీసేలా ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలతో పాటు క్రిస్మస్, నూతన సంవత్సర స్వాగత వేడుకలను పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తున్నారు. మరోవైపు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన అభిమానులను పోలీసులు స్టేషన్‌కు పిలిపిస్తున్నారు. దీంతో గ్రామాల్లో శాంతిభద్రతల సమస్య నెలకొనే ప్రమాదం ఏర్పడింది. కోళ్లదిన్నెలో సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి తన సొంత తోటలో జగన్ జన్మదినం, క్రిస్మస్ వేడుకలకు సంబంధించి ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీని మంగళవారం వేకువన గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ప్రభాకర్‌రెడ్డి తోటలోకి అక్రమంగా ప్రవేశించి ఫ్లెక్సీని చించివేయడంతో పాటు కిందపడేసి కాళ్లతో తొక్కారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొనేలా ఉంది. కాగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని జగన్ చిత్రపటంతో కప్పరాళ్లతిప్ప, పాతబిట్రగుంటలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన అభిమానులకు పోలీసులు ఫోన్ చేసి స్టేషన్‌కు రావాలని పిలుస్తుండడంపై గ్రామాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కూటమి నేతల ఒత్తిడితో పోలీసులు ఫ్లెక్సీలు కూడా కట్టనివ్వకపోవడం సరికాదని, పోలీసుల వైఖరి వివాదాలను మరింతగా పెంచేలా ఉన్నాయంటూ మండిపడుతున్నారు. కూటమి పార్టీల నాయకులు బోగోలు బజారులో నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు కట్టినా పట్టించుకోని పోలీసులు వైఎస్సార్‌సీపీ అభిమానులను మాత్రం స్టేషన్‌కు పిలిచి ఫ్లెక్సీలు తొలగించాలని కౌన్సిలింగ్ ఇవ్వడం సరికాదంటున్నారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో గొడవలు ముదరక ముందే పరిస్థితిని చక్కదిద్దాలని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు.


