‘కరెంటోళ్ల జనబాట’తో జవాబుదారీతనం
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం సీఎండీ శివశంకర్ లోతేటి వినూత్నంగా ప్రవేశపెట్టిన ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. సీఎండీ శివశంకర్ అన్నమయ్య జిల్లా పీలేరు మండలం పుట్టావాండ్లపల్లిలో పర్యటించి వినియోగదారుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించారు. తొలిరోజు డిస్కం పరిధిలోని 9 జిల్లాల్లో 28,672 సమస్యలు అధికారుల దృష్టికి రాగా, 507 సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారని చెప్పారు. ఇకపై ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహించనున్న కార్యక్రమం ద్వారా విద్యుత్ సమస్యలకు సత్వర పరిష్కారం, వినియోగదారులకు అధికారుల నుంచి జవాబుదారీతనం లభిస్తుందన్నారు.
నిరంతర విద్యుత్‌ను సరఫరా చేయాలి
కందుకూరు: పట్టణంలోని విద్యుత్‌శాఖ కార్యాలయంలో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పీ పుల్లారెడ్డి విద్యుత్ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒంగోలు ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు, టెక్నికల్ డైరెక్టర్ మురళీకృష్ణ, ఈఈ అత్తింటి వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.


