ప్రత్యామ్నాయ పంటలకు రుణ పరిమితి పెంపు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తూ ఆయా పంటలకు రుణ పరిమితిని పెంచుతున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. కలెక్టర్ చాంబర్‌లో వివిధ పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను ఖరారుకు జిల్లాస్థాయి టెక్నికల్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో 2026 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఆధ్వర్యంలోని సహకార సంఘాల ద్వారా రైతులకు పంట రుణాల మంజూరుపై చర్చించారు. వ్యవసాయ, మత్స్య, సహకార, పశుసంవర్థక శాఖ ల అధికారులు, రైతు సంఘాల నేతలతో చర్చించిన కలెక్టర్ రైతులకు ఆదాయం చేకూరే విధంగా వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేలా పంట రుణాల పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వేరుశనగకు రూ.50 వేల నుంచి రూ.55 వేలు, మొక్కజొన్నకు రూ.47 వేల నుంచి రూ.52 వేలు, మల్లె సాగుకు రూ.61వేల నుంచి రూ.65 వేలు, మత్స్యశాఖ ద్వారా పీతల పెంపకానికి యూనిట్‌కు రూ.5 లక్షల రుణ సాయం పెంచాలని నిర్ణయించారు. పశుసంవర్థక శాఖ ద్వారా ఆవుల యూనిట్‌కు రూ.45వేలు, గేదెల యూనిట్‌కు రూ.50వేలు, పౌల్ట్రీకు సంబంధించి ఒక బాయిలర్‌కు రూ.120, ఒక లేయర్‌కు రూ.260 రుణ పరిమితిని పెంచాలని సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. జిల్లాలో రైతులకు మెరుగైన ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తూ కోఆపరేటివ్ సొసైటీలు, బ్యాంకుల ద్వారా రుణ పరిమితిని పెంచి అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులకు విరివిగా రుణాలను మంజూరు చేసేందుకు బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. డీఆర్వో విజయ్‌కుమార్, ఎన్‌డీసీసీ బ్యాంక్ సీఈఓ శ్రీనివాసరావు, జిల్లా సహకార శాఖ అధికారి బీ గురప్ప, జిల్లా వ్యవసాయ అధికారిణి సత్యవేణి, ఎల్‌డీఎం మనిశేఖర్, పశుసంవర్థక శాఖ జేడీ రమేష్‌నాయక్, రైతు సంఘాల నాయకులు కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


