క్రీస్తు సందేశం సర్వమానవాళికి ఆచరణీయం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరురూరల్: ప్రభువు ఏసుక్రీస్తు చూపించిన శాంతి సందేశం ప్రపంచ మానవాళికి ఆచరణీయమని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు అనుదీప్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాణి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ పాల్గొన్నారు. తొలుత పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కాకాణి క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభువు ఏసుక్రీస్తు జననం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఘనంగా జరుపుకొనే పండగ క్రిస్మస్ అన్నారు. దాదాపు పది రోజుల ముందు నుంచి పండగ వాతావరణంలో క్రైస్తవులు జరుపుకొంటున్న ఏసుక్రీస్తు జన్మదిన వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఏసుక్రీస్తు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ క్రైస్తవులు శాంతి కపోతాలుగా సమాజంలో వ్యవహరిస్తున్నారన్నారు. ఏసుక్రీస్తు జీవితం పక్కవారికి సాయం చేస్తూ శాంతి మార్గంలో ఏ విధంగా నడుచుకోవాలో చెబుతుందన్నారు. నేటి సమాజంలో ప్రభువు శాంతి మార్గాన్ని మానవాళికి చూపించే బాధ్యతను పాస్టర్లు తీసుకోవాలన్నారు. సమాజంలో యువత తప్పు దోవ పట్టడంతో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు.


