ఆనం ఇలాకాలో చిరుద్యోగి గ్రావెల్ దందా
సాక్షి టాస్క్‌ఫోర్స్: జిల్లాలో మంత్రి ఆనం ఇలాకా అయిన అనంతసాగరం మండలం మంచాలపల్లిలో గ్రావెల్ దందాతో కొందరు చెలరేగిపోతున్నారు. మంత్రి అండతో అధికారులను అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా గ్రావెల్ అక్రమ రవాణా చేస్తుండడాన్ని స్థానికులు అడ్డుకుంటే వారిపైనే దాడి చేసి, ఫోన్లు ధ్వంసం చేసి పోలీసు కేసులు కూడా నమోదు చేయించడాన్ని స్థానిక టీడీపీ వర్గీయులే వ్యతిరేకిస్తున్నారు. మంత్రి ఆనం వర్గీయుడిగా చెలామణి అవుతున్న 104 వాహ నం డ్రైవర్ వినయ్ స్థానికంగా కొందరు టీడీపీ నేతల సహకారంతో విచ్చలవిడిగా గ్రావెల్ అక్రమ రవాణా చేస్తూ ప్రజా సంపదను కొల్లగొట్టుతున్నాడు. గ్రామానికి సమీపంలోని చెరువు కట్ట వద్ద ఉన్న కొండ ప్రాంతంలో అనుమతులు లేకుండా, నిబంధనంలకు విరుద్ధంగా గ్రావెల్‌ను తవ్వి నిత్యం రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారని ఆ గ్రామస్తులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఒక చిరుద్యోగిగా ఉండి ఈ స్థాయిలో గ్రావెల్ దందా నిర్వహిస్తున్నారంటే మంత్రి ఆనం అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలు లేకపోలేదు. కొండ ప్రాంతంలో జేసీబీలను ఏర్పాటు చేసి ట్రాక్టర్లతో గ్రావెల్ రవాణా చేస్తూ ఒక్కో టిప్పు రూ.1000లకు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి గ్రావెల్ తవ్వకాలు చేపడుతుండడంతో స్థానికులు కొందరు అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. అయితే గ్రావెల్ దందా నడిపే వ్యక్తులు మాకు మంత్రి ఆనం పర్మిషన్లు ఇవ్వడంతో తోలుతున్నాం.. మధ్యలో మీరెవంటూ గ్రామస్తులపై ఎదురు దాడికి దిగారు.
ఉద్రిక్తత వాతావరణం
అనుమతులిస్తే రాత్రిళ్లు ఎందుకు రహస్యంగా తోలుతున్నారంటూ ప్రశ్నించడంతో గ్రావెల్ మాఫి యా, గ్రామస్తుల మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరింది. ఇరుపక్షాల మధ్య తోపులాట జరడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అడ్డుకున్న గ్రామస్తులపై గ్రావెల్ మాఫియా వ్యక్తులు దాడి చేయడంతో ఫోన్లు కూడా ధ్వంసమైనట్లు సమాచారం. గ్రామస్తులపైనే దాడి చేసి వారిపైనే కేసు నమోదు చేసిన విషయం తెలుసుకున్న స్థానికు టీడీపీ నేతలు సైతం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వారి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గ్రావెల్ అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన పోలీసులు, అధికారులు కొమ్ము కాయడం వల్లే పార్టీకి చెడ్డ పేరొస్తుందంటూ మండిపడ్డారు. దీనిపై తహసీల్దార్ జయవర్ధన్ వివరణ అడగ్గా ఈ విషయంపై తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎవరైనా గ్రావెల్, మట్టి తరలిస్తే.. ఫొటోలు కానీ, వీడియో రూపంలో సమాచారం అందిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కన్నెత్తి చూడని అధికారులు
అక్రమ రవాణాను వ్యతిరేకిస్తున్న అధికార పార్టీ వర్గీయులు
అక్రమార్కులకు మద్దతివ్వడంపై పోలీసులపైనా ఆరోపణలు
అడ్డుకోవాల్సిందే అంటూ డిమాండ్
ఆనం ఇలాకాలో చిరుద్యోగి గ్రావెల్ దందా


