● బకాయిల వసూళ్ల పేరుతో ఏకంగా కోర్టు నోటీసులతో మెడపై కత్
చంద్రబాబు ప్రభుత్వం నెల్లూరు నగర ప్రజలపై రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తోంది. పట్టం కట్టినందుకు ప్రతీకారం తీర్చుకుంటోంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ బకాయిల వసూళ్ల పేరుతో పేద, మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలపై పచ్చ దాష్టీకాన్ని ప్రదర్శిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త సంప్రదాయాన్ని అమలు చేస్తున్నారు. ఇంటి, కుళాయి, ట్రేడ్ లైసెన్స్, అనధికార నిర్మాణాలకు సంబంధించి బకాయిల వసూళ్లకు డిమాండ్, ఫైనల్ నోటీసులు ఇవ్వకుండానే ఏకంగా కోర్టు నోటీసులతో మెడపై కత్తి పెట్టారు. బకాయిలు ఒకేసారి పూర్తిగా చెల్లించాలని అధికారులతో లోక్ అదాలత్‌లో కేసులు ఫైల్ చేస్తున్నారు. ఏళ్ల తరబడి రూ.లక్షల బకాయిలు ఉన్న బడాబాబులను వదిలేసి మధ్యతరగ తి ప్రజలను ఇక్కట్లకు గురి చేస్తున్న సర్కారు తీరుపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతోంది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగర పాలక సంస్థ పన్నుపోటుతో నగరవాసులకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. సాక్షాత్తు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సొంత ఇలాకాలోనే కార్పొరేషన్‌లో అధికారులు కొత్త సంప్రదాయానికి తెరతీశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పన్నులు చెల్లించాలని ఏకంగా కోర్టు నోటీసులు పంపి పేద, మధ్య తరగతి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్‌అదాలత్‌కు స్వయంగా హాజరై పన్నులు చెల్లించాలని మెడ మీద కత్తి పెట్టడం కలకలం రేపింది. నగర వాసుల్లో కోర్టు నోటీసులు అలజడి రేపడంతో మాష్టారు తీరుపై సర్వత్రా మండిపడుతున్నారు.
రూ.103.31 కోట్ల వరకు బకాయిలు
నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 1,43,988 అసెస్‌మెంట్లు ఉన్నాయి. వీటి నుంచి రూ.164.36 కోట్లు పన్నులు వసూలు కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు రూ.61.05 కోట్లు వసూలైంది. ఇంకా వసూలు కావాల్సింది రూ.103.31 కోట్ల వరకు ఉందని అధికారులు చెబుతున్నారు. నగర పరిధిలోని 166 సచివాలయాల్లో వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీలు 125 మంది, 10 మంది ఆర్‌ఐలు, ఇద్దరు ఆర్వోలు ఉన్నారు. వీరంతా కలిసి ఇంటి, కుళాయి పన్నుల వసూళ్లకు ముందుగా డిమాండ్ నోటీసులు అందజేయాల్సి ఉంది. అయితే వీరు ఆ బాధ్యతలను విస్మరించి నోటీసులు ఇవ్వడం లేదు. డిమాండ్ నోటీసులు ఇవ్వకుండానే ఉన్న ఫలంగా కోర్టు నోటీసులు ఇచ్చి లోక్‌అదాలత్‌లో పన్నులు చెల్లించుకోవాలని చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది.
చర్యలు ఇలా..
నగర ప్రజలు పన్నులు కట్టకపోతే నగర పాలక సంస్థ అధికారులు ఒకటికి రెండు సార్లు డిమాండ్ నోటీసులు అందజేయాలి. అప్పటికీ స్పందించకపోతే రెడ్ నోటీసులు జారీ చేయాలి. అయినా కట్టకపోతే చివరిగా లీగల్ నోటీసు జారీ చేసి తదుపరి చర్యలు చేపట్టాలి. కానీ నగర పాలక సంస్థ అధికారులు దాదాపు ఐదేళ్ల నుంచి నేటి వరకు ఇంటి, కుళాయి పన్నులకు సంబంధించి డిమాండ్ నోటీసులు ఇవ్వకుండానే ఏకంగా కోర్టు నోటీసులు జారీ చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. గడువు కూడా ఇవ్వకుండా రెండు వారాల ముందు ఉన్నఫలంగా కోర్టు నోటీసులు అందజేసి భయభ్రాంతులకు గురి చేయడం సమంజసం కాదని వాపోతున్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి కొత్త పోకడలకు పోలేదని, బకాయిల వసూళ్లకు వడ్డీ మాఫీ పేరుతో ప్రజలను ప్రోత్సహించేవని ప్రజలు గుర్తు చేస్తున్నారు. సంపద సృష్టి పేరుతో ప్రజల మెడపై వసూళ్ల కత్తి పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
7,500 మందికి నోటీసులు
పన్నుల పేరిట ఇటీవల 7,500 మందికిపైగా కార్పొరేషన్ అధికారులు కోర్టు నోటీసులు జారీ చేశారు. ఇందులో ఇంటి పన్ను పేరిట రెండు వేల మంది, కుళాయి పన్నుల పేరిట నాలుగు వేల మంది, ట్రేడ్ లైసెన్సుల పేరిట 1500 మందికి నోటీసులు జారీ చేయడం జరిగింది.
కుళాయి కనెక్షన్ లేకపోయినా..
కుళాయి కనెక్షన్ లేని వారికి, గతంలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జాతీయ మురికి వాడల అభివృద్ధి పథకం ద్వారా ఉచిత కుళాయి కనెక్షన్ పొందిన వారికి కూడా రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు కట్టాలని కోర్టు నోటీసులు జారీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై వామపక్షాలు కోర్టు నోటీసులను తగలబెట్టడం వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.
ముందస్తు డిమాండ్ నోటీసులివ్వకుండానే లోక్ అదాలత్‌లో కేసుల ఫైల్
కుళాయి కనెక్షన్లు లేని వారికి కూడా తప్పని వ్యాజ్యాలు
ఒక్కసారిగా రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు చెల్లించాలని ఒత్తిడి
ఎన్నడూ లేని విధంగా కూటమి సర్కారు పేద, మధ్య తరగతి ప్రజలపై దాష్టీకం
ఏళ్ల తరబడి రూ.లక్షల బకాయిలు ఉన్న బడాబాబుల జోలికి వెళ్లని అధికారులు
లబోదిబో
మంటున్న
బాధితులు
సంవత్సరాల తరబడి పన్నులకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఒక్కసారిగా కోర్టు నోటీసులు ఇవ్వడం ఏమిటని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి ఎక్కడా లేదని కేవలం నెల్లూరు నగర పాలక సంస్థలోనే ఇలా జరుగుతుండటం ఏమిటని ఇటీవల జరిగిన లోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్న బాధితుల్లో అధిక మంది ప్రశ్నించినట్లు తెలిసింది. మంత్రి నారాయణ ఇలాకాలోనే ఇలా జరుగుతుంటే రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా శివారు ప్రాంతాలు, కాలువ కట్టలపై నివాసాలుంటున్న నిరుపేదలు, మధ్య తరగతి ప్రజలకు పన్నుల కట్టాలని కోర్టు నోటీసులు జారీ చేయడంపై వారంతా లబోదిబో మంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
● బకాయిల వసూళ్ల పేరుతో ఏకంగా కోర్టు నోటీసులతో మెడపై కత్
● బకాయిల వసూళ్ల పేరుతో ఏకంగా కోర్టు నోటీసులతో మెడపై కత్


