నల్లపరెడ్డి నివాసానికి జేసీ
నెల్లూరురూరల్: మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి నెల్లూరులోని నల్లపరెడ్డి నివాసానికి సోమవారం వచ్చారు. తన అత్త నల్లపరెడ్డి శ్రీలక్ష్మమ్మ, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో గడిపారు.
వెంకటాచలం సీహెచ్‌సీకి
జాతీయ స్థాయి గుర్తింపు
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలోని వెంకటాచలం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ బాహ్య మూల్యాంకనంలో వెంకటాచలం సీహెచ్‌సీ 84.29 శాతం మార్కులను సాధించి నాణ్యత ధ్రువీకరణ పొందినట్లుగా కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మూల్యాంకనం ద్వారా ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ బృందం సీహెచ్‌సీలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, సదుపాయాలు, మౌలిక వసతులు, పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు, రోగి సంతృప్తి వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి ఎన్‌క్యూఏఎస్ గుర్తింపును ప్రకటించిందని చెప్పారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ అధికారులు, వైద్యులను కలెక్టర్ అభినందించారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు జాతీయ స్థాయిలో నాణ్యత ప్రమాణాలను సాధించడం ద్వారా ప్రజారోగ్య వ్యవస్థపై విశ్వాసం మరింత పెరుగుతుందన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
56,546 మెట్రిక్ టన్నుల
యూరియా సరఫరా
నెల్లూరు(పొగతోట): జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్‌కు సంబంధించి 94,383 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటి వరకు 56,546 మెట్రిక్ టన్నులను సరఫరా చేశామని జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి సత్యవాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు వివిధ పంటల సాగుకు 42,710 మెట్రిక్ టన్నులను విక్రయించామని చెప్పారు. కోఆపరేటివ్ సొసైటీలు, ఆర్‌ఎస్‌కేలు, మార్క్‌ఫెడ్ గోదాములు, రిటైల్, హోల్‌సేల్ ఏజెన్సీలు, కంపెనీ గోదాముల్లో మరో 18278 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని తెలిపారు. ఈ నెలాఖరుకు మరో 22వేల మెట్రిక్ టన్నులు జిల్లాకు సరఫరా కానుందన్నారు. రైతులు, పంటల సాగు వివరాలు సేకరించి ప్రణాళికాబద్ధంగా యూరియా పంపిణీకి చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో యూరి యా, ఎరువుల కొరత లేదని తెలిపారు.
తల్లి మరణం
జీర్ణించుకోలేక..
● కుమారుడి ఆత్మహత్య
ఉలవపాడు: తల్లి మరణం జీర్ణించుకోలేక ఓ కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని పెదపట్టపుపాళెం గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన కాటంగారి గోవిందు (64) చేపల వేట చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఈ నెల 19 న గోవిందు తల్లి కాటంగారి భూషమ్మ అనారోగ్యంతో మరణించింది. ఈ బాధ తట్టుకోలేక గోవిందు ఈ నెల 20వ తేదీ వరి చేనుకు కొట్టే పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు విషయం తెలుసుకుని ఉలవపాడులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించి పురుగు మందు కక్కించారు. 21న ఉదయం చలి జ్వరం అధికంగా వస్తుండడంతో ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతిచెందాడు. గోవిందు కోడలు కాటంగారి శ్రావణి సోమవారం రాత్రి ఉలవపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఉలవపాడు ఎస్సై సుబ్బారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీవారి దర్శనానికి
8 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 76,903 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. టికెట్లు లేని వారికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో దర్శనం చేసుకోగలుగుతున్నారు. కాగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.


