విద్యుత్ సమస్యల పరిష్కారానికి ‘కరెంటోళ్ల జనబాట’
నెల్లూరు(దర్గామిట్ట): విద్యుత్ సమస్యల పరిష్కా రానికి ఏపీఎస్పీడీసీఎల్ రూపొందించిన కరెంటోళ్ల జనబాట కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు, యాప్‌ను కలెక్టరేట్‌లోని తిక్కన భవన్‌న్‌లో కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారుల సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి పరిష్కరించే లక్ష్యంతో కరెంటోళ్ల జనబాట కార్యక్రమానికి విద్యుత్‌శాఖ శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది నేరుగా గ్రామాలు, పట్టణ వార్డుల్లో పర్యటించి వినియోగదారులతో మమేకమవుతారని చెప్పారు. ప్రస్తుతం ప్రతి సోమవారం తిరుపతిలో నిర్వహించే డయల్ యువర్ సీఎండీ, జిల్లాలో ప్రతి సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు నిర్వహించే డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమాల ద్వారా వినియోగదారుల ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం అందిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రజలు విద్యుత్ అధికారులకు పూర్తి సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఎం రాఘవేంద్రం, ఈఈలు బాలచంద్ర, శ్రీధర్, లక్ష్మీనారాయణ, పరంధామయ్య, బెనర్జీ, భానునాయక్, డీఈఈ మునీంద్ర, తదితరులు పాల్గొన్నారు.


