ఇబ్బంది పడుతున్నాం.. ఆదుకోండి
● ఎస్పీని కోరిన వృద్ధులు
● పోలీస్ కార్యాలయంలో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
● 113 వినతుల అందజేత
నెల్లూరు(క్రైమ్): ‘నా వయస్సు 85 సంవత్సరాలు. నా పేరుపై ఉన్న పొలాన్ని తమ పేరుపై రాసివ్వాలని కొడుకు, కోడలు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. విచారించి చర్యలు తీసుకోవాలి’ అని ఇందుకూరుపేటకు చెందిన ఓ వృద్ధుడు కోరాడు. ‘నా వయస్సు 80 సంవత్సరాలు. నా పొలాన్ని, ఇంటిని రెండో కుమారుడు బలవంతంగా తీసుకుని ఇంట్లోంచి గెంటేశాడు. జీవనం కష్టతరంగా మారింది’ అని దగదర్తికి చెందిన ఓ వృద్ధురాలు వినతిపత్రం అందజేశారు. సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 113 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజితకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె ఆయా ప్రాంత పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, రూరల్, ఎస్‌బీ డీఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాసరావు, ఎ.శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, పీసీఆర్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్లు భక్తవత్సలరెడ్డి, బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని..
● హైదరాబాద్‌కు చెందిన హరికృష్ణ, అనంతసాగరానికి చెందిన ఓ వ్యక్తి వర్క్ ఫ్రం హోం ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.12 లక్షలు తీసుకుని మోసగించాడు. నగదు అడిగితే ఇబ్బందులు గురిచేస్తున్నాడని వింజమూరుకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
● వింజమూరు గ్రామానికి చెందిన హజరతయ్య పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. నా వద్దనున్న బంగారం, వెండి, రూ.6 లక్షల నగదు తీసుకుని పెళ్లిచేసుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని విజయవాడకు చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు.
● విభేదాలతో నేను భర్త నుంచి దూరంగా పుట్టింట్లో ఉంటున్నాను. నా వదిన వేరే ఫోన్ల నుంచి అసభ్యకరంగా మెసేజ్‌లు, అశ్లీల చిత్రాలు పెడుతూ మానసికంగా ఇబ్బందులు పెడుతోంది. విచారించి చర్యలు తీసుకోవాలని బాలాజీనగర్‌కు చెందిన ఓ మహిళ కోరారు.
● నా కుమార్తె ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. ఈనెల 16న స్కూల్‌కు వెళ్లి తిరిగిరాలేదు. కందుకూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. ఆమె ఆచూకీ కనుక్కోవాలని కందుకూరు రూరల్ ప్రాంతానికి చెందిన ఓ తల్లి వినతిపత్రమిచ్చారు.
● భర్త, అత్తమామలు అదనపుకట్నం కోసం వేధిస్తున్నారు. ఇంట్లోంచి గెంటేశారు. ఎనిమిది నెలలుగా పుట్టింట్లో ఉంటున్నాను. విచారించి కాపురాన్ని చక్కదిద్దాలని బిట్రగుంటకు చెందిన ఓ వివాహిత విజ్ఞప్తి చేశారు.
● మాది ప్రేమ వివాహం. భర్త మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడు. కౌన్సెలింగ్ చేసి కాపురాన్ని చక్కదిద్దాలని ముత్తుకూరుకు చెందిన ఓ మహిళ కోరారు.


