బైక్ మెకానిక్.. దొంగగా మారి
● మద్యానికి బానిసై చోరీలు
● 8 ద్విచక్ర వాహనాల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): బైక్ మెకానిక్ మద్యానికి బానిసయ్యాడు. వ్యసనం తీర్చుచుకునేందుకు సంపాదన చాలకపోవడంతో దొంగగా మారాడు. రోడ్లపై పార్క్ చేసిన బైక్‌లను చోరీ చేసి పోలీసుల కళ్లుగప్పి తిరగసాగాడు. అతని కదలికలపై నిఘా ఉంచిన నెల్లూరు బాలాజీ నగర్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. బాలాజీ నగర్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ కె.సాంబశివరావు వివరాలను వెల్లడించారు. కోవూరు మండలం ఇనుమడుగు గ్రామం మిక్స్‌డ్ కాలనీకి చెందిన గూడూరు చిరంజీవి బైక్ మెకానిక్. ఈనెల 8వ తేదీన పూలేబొమ్మ వద్ద మైపాడుగేటుకు చెందిన రవి బైక్‌ను అపహరించాడు. రవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణలో ఎస్సై విజయ్ శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి సాంకేతికత ఆధారంగా నిందితుడిని చిరంజీవిగా గుర్తించారు. సోమవారం ఇనుమడుగు వద్ద అదుపులోకి తీసుకుని విచారించారు. బాలాజీ నగర్ స్టేషన్ పరిధిలో నాలుగు బైక్‌లు, నవాబుపేట పరిధిలో 2, చిన్నబజారు, కోవూరు పోలీసుస్టేషన్‌ల పరిధిలో చెరో ఒక బైక్‌ను చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించడంతో అరెస్ట్ చేశారు. చోరీ సొత్తును స్వాధీ నం చేసుకున్నామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. బైక్ దొంగను అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన ఇన్‌స్పెక్టర్, ఎస్సై, సిబ్బంది కేవీ సుధాకర్, రమేష్, వెంకటరావు, జయరామయ్య, శివకుమార్, కానిస్టేబుళ్లు శ్రీహరి, తిరుపతి, సాయికిశోర్‌ను ఉన్నతాధికారులు అభినందించారు.


