హాకీ పోటీల్లో విజేతగా నెల్లూరు
నక్కపల్లి: రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో (అండర్– 19) బాలుర విభాగంలో నెల్లూరు, బాలికల విభాగంలో తూర్పు గోదావరి జిల్లా జట్లు విజేతలుగా నిలిచాయి. ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నక్కపల్లిలో మూడురోజులపాటు జరిగిన ఈ పోటీలు సోమవారం ముగిశాయి. రాష్ట్రంలో అన్ని ఉమ్మడి జిల్లాల నుంచి హాకీ క్రీడాకారులు విచ్చేశారు. బాలుర విభాగంలో హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తూర్పుగోదావరి జిల్లా జట్టుపై నెల్లూరు జట్టు విజయం సాధించి విజేతగా నిలిచింది. మరో పోటీలో వైఎస్సార్ కడపపై విశాఖ జిల్లా జట్టు గెలుపొంది తృతీయ స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో విశాఖపట్నంపై తూర్పుగోదావరి జట్టు విజయం సాధించింది. మరో పోటీలో చిత్తూరుపై గెలిచి అనంతపురం జిల్లా జట్టు తృతీయ స్థానంలో వచ్చింది. ముగింపు కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు వీసం నానాజీ, వెలగా ఈశ్వరరావు, ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పుష్పలత, బీఎస్ హాకీ క్లబ్ ఫౌండర్ సూరిబాబు, కార్యదర్శి తాతాజీ, స్థానిక నాయకులు మేడేటి శంకర్, వీసం రాజు, నానాజీ, చిన అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.


