పేదల బియ్యాన్ని బొక్కేస్తూ.. | - | Sakshi
Sakshi News home page

పేదల బియ్యాన్ని బొక్కేస్తూ..

Nov 25 2025 5:48 PM | Updated on Nov 25 2025 5:48 PM

పేదల బియ్యాన్ని బొక్కేస్తూ..

పేదల బియ్యాన్ని బొక్కేస్తూ..

ఉదయగిరి: స్థానిక ఎమ్మెల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి బియ్యం పెద్ద మొత్తంలో పక్కదారి పట్టిన ఉదంతం కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో ఓ కాంట్రాక్ట్‌ ఉద్యోగి కీలకపాత్ర పోషించగా, దీని వెనుక రెవెన్యూ అధికారులు ప్రమేయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రతి నెలా సరఫరా ఇలా..

జిల్లాలోని రాపూరు, నెల్లూరు, ఇందుకూరుపేట, కోవూరు, పొదలకూరు, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి, వింజమూరు, కందుకూరు, బుచ్చిరెడ్డిపాళెం మండల కేంద్రాలల్లో సివిల్‌ సప్లయ్స్‌ స్టాక్‌ పాయింట్లున్నాయి. ఇందులో ఉండే గోదాములకు ప్రతి నెల 11 వేల మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యాన్ని సరఫరా చేస్తారు. అనంతరం ఇక్కడి నుంచే మండలాల్లోని చౌక దుకాణాలకు సరుకులు చేరుతాయి. రూ.కోట్ల విలువజేసే బియ్యం పంపిణీ వ్యవస్థ సక్రమంగా సాగాలంటే ప్రభుత్వోద్యోగులుండాలి. అయితే స్టాక్‌ పాయింట్లపై సర్వాధికారాన్ని అక్కడ పనిచేసే కాంట్రాక్ట్‌ ఉద్యోగుల చేతుల్లో ఉంచి అవినీతికి ఆస్కారం కల్పిస్తున్నారు.

అక్రమ రవాణాకు గేట్లెత్తారు

టీడీపీ ప్రభుత్వం కొలువుదీరాక బియ్యం అక్రమ రవాణాకు ప్రతి నియోజకవర్గంలో గేట్లు తెరిచారు. స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధులు తమ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని అక్రమంగా తరలిస్తూ రూ.కోట్లు గడిస్తున్నా రు. ఈ తంతు బహిరంగంగానే జరుగుతున్నా, అధికారులు పట్టించుకోవడం లేదు. తమ పని సజావుగా సాగేందుకు గానూ ముఖ్య అధికారులకు మామూళ్లు ముట్టజెప్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు.

అన్నీ అనుమానాలే..

గోదాముల్లో సరుకుల బ్యాలెన్స్‌ షీట్‌ను ఉన్నతాధికారులు తనిఖీ చేయాల్సి ఉంది. అయితే అక్రమాలకు గుర్తించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ఉదయగిరి స్టాక్‌ పాయింట్‌లో తనిఖీలు నిర్వహించిన అధికారులు 200 మెట్రిక్‌ టన్నులు బియ్యం స్వాహా అయిందనే అంశాన్ని గుర్తించి గోదాముకు గత శుక్రవారం రాత్రి సీలేశారు. డిసెంబర్‌కు సంబంధించిన బియ్యాన్ని దించేందుకు మూడు రోజుల క్రితం వచ్చిన లారీ అక్కడే ఉంది. వింజమూరు నుంచి ఓ కాంట్రాక్ట్‌ ఉద్యోగిని పంపినా, గోదాములకు సీలేయడంతో బియ్యాన్ని దింపే పరిస్థితి లేదు. నెల్లూరులోని సివిల్‌ సప్లయ్స్‌ కార్యాలయ సిబ్బంది ఉదయగిరికి ఆదివారం వచ్చి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం గోడౌన్‌ సిబ్బంది విధులకు హాజరైనా సీల్‌ వేయడంతో బయటే ఉండిపోయారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసులును గోదాము ఇన్‌చార్జిగా నియమించారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 26 నుంచి 31 వరకు వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్‌ సరఫరా చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి బియ్యం కేటాయించాల్సి ఉంది. సీల్‌వేయడంతో పరిస్థితి అయోమయం ఏర్పడిండి.

నాలుగు వేల బస్తాల స్వాహా

ఉదయగిరి ఎమ్మెల్‌ఎస్‌ పాయింట్‌కు ప్రతి నెలా 600 టన్నుల రేషన్‌ బియ్యాన్ని సరఫరా చేస్తారు. మర్రిపాడు, ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు మండలాల్లో ఉన్న 120 చౌక దుకాణాలకు సరఫరా అవుతాయి. వీటి పరిధిలో సుమారు 40 వేల మంది లబ్ధిదారులు.. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు చేరుస్తారు. స్టాక్‌ పాయింట్‌ నిర్వహణ బాధ్యతల పర్యవేక్షణకు రెగ్యులర్‌ ఉద్యోగి లేరు. దీంతో అక్కడ పనిచేసే ఓ కాంట్రాక్ట్‌ ఉద్యోగికి పూర్తి బాధ్యతలను అప్పజెప్పారు. దీన్ని ఆసరాగా చేసుకున్న సదరు వ్యక్తి పేదల బియ్యాన్ని నేరుగా బ్లాక్‌ మార్కెట్‌కు తరలించే ఎత్తుగడకు తెరలేపారు. దీని వెనుక కొంతమంది అధికార పార్టీ పెద్దల ప్రమేయముందనే ఆరోపణలున్నాయి. రేషన్‌ షాపులకు సరఫరా చేయాల్సిన సరుకుల్లో కొంతమేర కోత విధించి.. అంగన్‌వాడీ కేంద్రాలకు అందాల్సిన బియ్యం, నూనె, కందిపప్పు ఇతర సరుకులనూ మింగేశారు. ఇలా పక్కదారి పట్టించిన నాలుగు వేల బస్తాలు (200 మెట్రిక్‌ టన్నులు) విలువ బహిరంగ మార్కెట్లో రూ.కోటికిపైగానే ఉంటుంది.

ఎమ్మెల్‌ఎస్‌ పాయింట్ల నుంచి పక్కదారి

అధికార పార్టీ నేతల అండదండలతో

అక్రమాలు

కాంట్రాక్ట్‌ ఉద్యోగులదే పెత్తనం

తనిఖీలను విస్మరించిన అధికారులు

ఉదయగిరి కేంద్రంలో

రూ.కోటి విలువజేసే రైస్‌ స్వాహా

పేదల బియ్యాన్ని బొక్కేయడంలో అక్రమార్కులు తలమునకలై ఉన్నారు. ఎమ్మెల్‌ఎస్‌ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది, అధికార పార్టీ పెద్దలు కుమ్మకై ్క రేషన్‌ షాపులకు చేరకుండానే బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్నారు. సివిల్‌ సప్లయ్స్‌ శాఖ పెద్దలకు ఈ వ్యవహారం తెలిసినా నోరు మెదపడంలేదు. జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పట్టబడుతుండటం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement