అంతా ఆర్భాటమే..! | - | Sakshi
Sakshi News home page

అంతా ఆర్భాటమే..!

Apr 1 2026 8:12 AM | Updated on Apr 1 2026 8:12 AM

అధికారమే పరమావధిగా గత ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో ప్రస్తుత సీఎం చంద్రబాబు ఆచరణ సాధ్యం గాని హామీలను గుప్పించారు. ఇందులో భాగంగా అర్హులందరికీ పింఛన్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. ఇది నిజమని భావించి ఓట్లేసి గెలిపించిన ప్రజలకు.. విజయం సాధించాక తన నిజ స్వరూపాన్ని చూపారు. కొత్తగా మంజూరు చేయకపోగా, ఉన్న వాటి తొలగింపునకు ఉపక్రమించారు. తమ పార్టీకి ఓటేయని వారి పింఛన్లను తొలగించాలంటూ గ్రామీణ ప్రాంతాల్లో అధికారులపై కూటమి నేతలు ఒత్తిడి తెస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఇంత అస్తవ్యస్తమైన పరిస్థితులు నెలకొన్న తరుణంలో వీటిని పంపిణీ చేసేందుకు గానూ వింజమూరుకు ముఖ్యమంత్రి బుధవారం రానుండటం విస్మయానికి గురిచేస్తోంది. నూతనంగా ఒక్కటిని సైతం మంజూరు చేయకుండా.. ఆయన రావడమెందుకనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

నెల్లూరు(పొగతోట) / ఉదయగిరి: టీడీపీ ప్రభుత్వం కొలువుదీరి 22 నెలలవుతున్నా, నేటికీ ఒక్క పింఛన్‌ను సైతం మంజూరు చేయలేదంటే అతిశయోక్తి కాదు. అర్హులందరికీ మంజూరు చేస్తామని గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు, ప్రస్తుతం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక రకరకాల కొర్రీలతో ఉన్న వాటికి కత్తెరేసేందుకు సర్కార్‌ ఉపక్రమించింది. అనర్హులకు పింఛన్లు ఇచ్చారనే కుట్రను తెరపైకి తెచ్చింది. ఈ తరుణంలో లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత రావడంతో పరిశీలన ప్రక్రియను కొంతకాలం పాటు వాయిదా వేశారు. ఈ తరహాలో దివ్యాంగ పింఛనర్లకు చుక్కలు చూపిస్తున్నారు. వీరిని నానా ఇబ్బందులకు గురిచేసి పైశాచికానందాన్ని పొందుతున్నారు. మరోవైపు వీటిని అందుకుంటున్న వారు మరణిస్తే, వారి కుటుంబసభ్యులకు మంజూరు చేసేందుకే ప్రస్తుతం పరిమితమయ్యారు.

నాటికి.. నేటికీ ఎంతో వ్యత్యాసం

గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో 2024 మార్చిలో జిల్లాలో 3.17 లక్షల మందికి పింఛన్లను అందజేశారు. అయితే ప్రస్తుతం ఇది 2.9 లక్షలకు పరిమితమైంది. దీనిబట్టి ఈ రెండేళ్లలో 27 వేల మందికి మొండిచేయి చూపి వారి నోట్లో మట్టి కొట్టారు. ఏదో కారణాన్ని చూపి దీన్ని మరింత తగ్గించే దిశగా సర్కార్‌ అడుగులేస్తోంది. మరోవైపు నూతన పింఛన్ల కోసం దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు ఎంతో ఆశగా నిరీక్షిస్తున్నారు. అయితే దరఖాస్తు చేసుకునే అవకాశాన్నీ కల్పించపోవడంతో ఏమి చేయాలో పాలుపోక వీరు కుమిలిపోతున్నారు.

నాడు.. సంక్షేమమే పరమావధిగా..

గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో పింఛన్ల మంజూరు ప్రక్రియ ఎంతో సజావుగా సాగేది. అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరమే ఉండేది కాదు. అర్హుల ఇళ్ల నుంచే వారి వివరాలను వలంటీర్లు అప్‌లోడ్‌ చేస్తే మరుసటి నెల్లోనే లభించేవి. ఇబ్బందుల్లేకుండా కొత్త వాటిని ఎప్పటికప్పుడు మంజూరు చేసేవారు. రాజకీయాలకతీతంగా అందరికీ అందేవి. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితుల్లేకపోవడంతో పలువురు మండిపడుతున్నారు.

2.9 లక్షల మందికి..

సామాజిక భద్రత పింఛన్ల నగదు పంపిణీకి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా 2.9 లక్షల మంది లబ్ధిదారులకు రూ.126 కోట్ల మేర బుధవారం పంపిణీ చేయనున్నారు.

జలదంకికి చెందిన 69 ఏళ్ల మస్తానయ్య వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటున్నారు. వయస్సు రీత్యా పనులకు సక్రమంగా వెళ్లలేక అగచాట్లకు గురవుతున్నారు.

ఒక్కొక్కరి గాథ.. ఒక్కోలా..

బోగోలుకు చెందిన దివ్యాంగుడు రవి పింఛన్‌ కోసం నానా అవస్థలు పడుతున్నారు.

సంగం మండలానికి చెందిన శాంతి భర్త ఏడాదిన్నర క్రితం మృతి చెందారు. ఈమెకు ఇద్దరు పిల్లలు. వితంతు పింఛన్‌ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా, కనికరం చూపే నాథుడే కరువయ్యారు. అఽధికారులకు దరఖాస్తులను అందజేసినా ప్రయోజనం శూన్యం.

గత వైఎస్సార్సీపీ హయాంలో..

మార్చి 2024 నాటికి 3.17 లక్షలు

కూటమి ప్రభుత్వంలో..

ప్రస్తుతం – 2.9 లక్షలు

గత ఎన్నికలకు ముందు హామీలు

ఉన్న వాటికి ప్రస్తుతం కోత..

నూతనంగా మంజూరు శూన్యం

దరఖాస్తు చేసుకునేందుకూ

అవకాశమేదీ..?

ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఇదే పరిస్థితి

వేలాది మంది ఎదురుచూపులు

గత ప్రభుత్వ హయాంలో ఎంతో సాఫీగా

వాగ్దానాలను విస్మరించి నేడు

జిల్లాకు రానున్న సీఎం చంద్రబాబు

ఉదయగిరి: వింజమూరులో బుధవారం నిర్వహించనున్న సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరై.. స్థానిక ఎస్సీ కాలనీలో ఓ లబ్ధిదారుడికి నగదును అందజేయనున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం వాస్తవ విరుద్ధంగా ఉంది. నూతనంగా పొందాలనే ఆశతో ఎంతో మంది ఉన్నా, వారిపై ఏ మాత్రం కనికరం చూపడంలేదు. రెండు నెలల క్రితం నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో ప్రతి జిల్లాకూ 200 కొత్త పింఛన్లను కేటాయిస్తూ, ఎంపిక బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు. అయితే దీనికి సంబంధించి ఒక్క అడుగూ ముందుకు పడలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement