● గ్రామీణ గిరిజనులు, దళితులే లక్ష్యంగా మెప్మా ఉద్యోగులు
● ఒక్కొక్కరి పేరిట రూ.లక్ష రుణం మంజూరు
● రూ.20 వేలు చేతిలో పెట్టి
మొత్తం కాజేస్తున్న ముఠా
● ‘శ్రీ మణికంఠ’ అనే గ్రూపు పేరుతో
రూ.12 లక్షల రుణాలు మంజూరు చేయించిన వైనం
● కథ అడ్డం తిరగడంతో ఖాతాలను
అప్పటికప్పుడే ఫ్రీజ్ చేయించిన ఆర్‌పీఎంలు
● బ్యాంక్ అధికారుల అండదండలతో సాగుతున్న దందా?
● లబ్ధిదారులను పట్టణ వాసులుగా
చూపించి బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభం
● నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న
డీఆర్డీఏ అధికారులు
కోవూరు: అమాయక గిరిజన, దళిత మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, రుణాల పేరుతో అడ్డంగా దోచుకుంటున్న ‘మనీ మాఫియా’ కోవూరు మండలంలో కోరలు చాచుతోంది. ఇప్పటి వరకు ప్రైవేట్ వ్యక్తులే ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటే... తాజాగా నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని మెప్మా ఉద్యోగులు, కొందరు ఆర్‌పీఎంలు తమ పరిధి దాటి వచ్చి గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజన, దళిత కాలనీలను టార్గెట్ చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. కొంత కాలం క్రితం విడుదలైన ‘కుబేర’ సినిమా తరహాలో ఆయా సామాజిక వర్గాల మహిళలను పావులుగా వాడుకుంటూ లక్షలాది రూపాయల స్కామ్‌కు తెరలేపారు. ఆర్పీఎంల ముసుగులో వచ్చిన కొందరు కేటుగాళ్లు, బ్యాంకు అధికారులతో కుమ్మకై ్క సాగిస్తున్న ఈ దందా ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది.
అప్పులు లబ్ధిదారులకు.. డబ్బులు ఆర్‌పీఎంలకు
రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు వారివి. తెల్లవారితే కూలి పనులకు వెళ్తేనే గానీ పొయ్యి వెలగని దుస్థితి. అటువంటి నిరుపేద దళిత, గిరిజన మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న ఈ కేటుగాళ్లు, వారి జీవితాలను అప్పుల ఊబిలోకి నెట్టేశారు. ‘మీ కష్టాలు తీరుస్తాం.. మీకు అండగా ఉంటాం‘ అంటూ నమ్మబలికి.. వారి మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారు. కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ వాస్తవానికి గ్రామీణ పరిధిలోకి వస్తోంది. వీరందరూ డీఆర్‌డీఏ పరిధిలోకి వస్తారు. కానీ నెల్లూరు నగరంలోని మెప్మా ఉద్యోగులు, ఆర్‌పీఎంలు కొందరు పడుగుపాడులోని ఎన్టీఆర్‌నగర్ గిరిజన కాలనీకి చెందిన 12 మంది మహిళలను గ్రూపు తయారు చేశారు. తమకు నెల్లూరు నవాబుపేటలోని కెనరా బ్యాంకు అధికారులతో పరిచయాలు ఉన్నాయని, భారీగా రుణాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. కోవూరు బ్యాంకుల్లో చేస్తే ఎక్కడ గుట్టు రట్టవుతుందోనన్న భయంతో వ్యూహాత్మకంగా వారిని నెల్లూరుకు తీసుకెళ్లారు. వీరంతా పట్టణ వాసులుగా నమ్మబలికి ‘శ్రీ మణికంఠ’ అనే గ్రూపు పేరుతో 12 మందికి వ్యక్తిగత ఖాతాలను ప్రారంభించారు. ఒక్కొక్కరు రూ. 20 వేలు జమ చేస్తే రూ.లక్ష లోన్ వస్తుందని ఆర్పీఎంలు మహిళలకు చెప్పారు. అయితే ఆ పేద మహిళలు తమ వద్ద అంత డబ్బు లేదనడంతో ఆ ఆర్‌పీఎంలే రూ. 2.40 లక్షలు కట్టి ఖాతాలు తెరిపించారు. అనుకున్నట్లుగానే అందరి పేరిట రుణాలు మంజూరు చేయించారు. అయితే ఈ లోను మొత్తం మీరే చెల్లించాల్సి ఉంటుందని ఎవరో వారికి స్పష్టంగా చెప్పారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ. లక్ష జమ అయినట్లు మెసేజ్‌లు వచ్చాయి. తీరా డబ్బులు డ్రా చేసే సమయానికి అసలు రంగు బయట పడింది. వచ్చిన రుణంలో మీరు రూ.20 వేలు మాత్రమే తీసుకొని మిగిలిన రూ.80 వేలు తమకు ఇవ్వాలని ఆర్‌పీఎంలు చెప్పారు. అదేంటి మీరిచ్చిన రూ.20 వేల అయితే ఇస్తామని, మిగిలిన డబ్బులివ్వబోమని మహిళలు అడ్డం తిరిగారు. మాకు వచ్చిన డబ్బులు మేమే తిరిగి కట్టాలి కదా? మీకెందుకు ఇవ్వాలని ఎదురు తిరగడంతో ఆర్‌పీఎంల బృందం, లబ్ధిదారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ‘బ్యాంకు రికార్డుల్లో లోన్ మొత్తం మా పేరునే ఉంటుంది.. రేపు మీరు కట్టకపోతే బ్యాంకు వాళ్లు మా ఇళ్లకు వస్తారు.. మీకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు‘ అని మహిళలు తెగేసి చెప్పారు. దీంతో వారి ఖాతాల్లో జమ అయిన మొత్తాలు డ్రా చేయనీకుండా ఆర్‌పీఎంలు ఖాతాలను ప్రీజింగ్ చేయించారు.
బ్యాంకు అధికారుల పాత్రపై అనుమానాలు
కేవలం పది వేల రుణం కావాలంటే సామాన్యులను ముప్ప తిప్పలు పెట్టే బ్యాంకు అధికారులు, ఏకంగా లక్షల రూపాయల రుణాలను ఇంత సులభంగా ఎలా మంజూరు చేశారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. మహిళలు డబ్బులు ఇవ్వడం లేదని తెలియగానే, ఆర్పీ ఎంలు ఫోన్ చేయగానే బ్యాంకు అధికారులు స్పందించి ఖాతాలను నిలుపుదల ప్రీజ్ చేయడం చూస్తుంటే, ఈ స్కామ్‌లో వారి పాత్రపై అనేక అనుమానాలు ఉన్నాయి. గతంలో నెల్లూరులోని ఓ ప్రైవేట్ బ్యాంక్ అధికారులు సైతం కొందరు టీడీపీ నేతలతో కలిసి అక్షరం ముక్క రాని గిరిజనులను సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా చూపించి రూ.కోట్ల దోపిడీకి పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో బ్యాంక్ అధికారుల పాత్ర వెలుగుచూడడం విదితమే. తాజాగా ఆ తరహాలో ప్రభుత్వ రంగ బ్యాంక్ అధికారులు రుణాల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిఘా కరువైన డీఆర్డీఏ
జిల్లాలో పొదుపు సంఘాల ముసుగులో ఇలాంటి మోసాలు జరుగుతున్నా.. వాటిని పర్యవేక్షించాల్సిన డీఆర్డీఏ అధికారులు మాత్రం కళ్లకు గంతలు కట్టుకుని వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉద్యోగులు తమ పరిధి దాటి గ్రామీణ ప్రాంతాల్లో పేదలను పొదుపు గ్రూపుల్లో చేర్పించి, వారి పేరుతో రుణాలు తీసుకుని మోసాలకు తెగబడుతుంటే.. తమకేమి సంబంధం లేదన్నట్లుగా ఉంటున్నారు. ఆర్పీఎంల వాటాల్లో వీరికి కూడా కమీషన్లు అందుతున్నాయే కాబట్టే పట్టించుకోవడం లేదని గిరిజన మహిళలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. కోవూరు మండలంలో ఇలాంటి స్కామ్‌లు గతంలోనూ వెలుగు చూసినా అధికారులు స్పందించకపోవడం గమనార్హం. ప్రభుత్వం తక్షణమే స్పందించి, గిరిజన మహిళలను అప్పుల పాలు చేస్తున్న ఈ ‘మనీ మాఫియా’ ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ కుంభకోణంలో భాగస్వాములైన బ్యాంకు అధికారులు, ఆర్పీఎంలపై విచారణ జరిపించాలని బాధితులు కోరుతున్నారు.
మెప్మా అధికారిక యాప్‌లో అఫ్రూవల్ అయితేనే రుణాలు మంజూరు చేస్తాం
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో ఉండే గ్రూపులకు మాత్రమే మా బ్యాంక్ నుంచి కొత్త రుణాలు మంజూరు చేస్తాం. మెప్మా పీడీ అఫ్రూవల్ ఇస్తేనే లోన్ మంజూరు చేస్తాం. మండల ప్రాంతాల్లో ఉండే వారికి మాత్రమే ఖాతాలు ప్రారంభిస్తాం. శ్రీ మణికంట గ్రూప్ గతంలో నెల్లూరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఉంటూ రూ.10 లక్షల రుణం తీసుకొన్నారు. అక్కడ రద్దు చేసుకొని ఇక్కడ ఓపెన్ చేశారు. గతంలో ఉన్న సీనియారిటీని తీసుకొని ఈ గ్రూపునకు రూ.10 లక్షలు రుణం మంజూరు చేశాం. ఆ సభ్యులంతా నెల్లూరు ప్రాంతానికి చెందిన వారం అని చెప్పడంతోనే గ్రూప్‌నకు రుణం ఇవ్వడం జరిగింది.
– గుజ్జల చంద్రశేఖర్, కెనరా బ్యాంక్
మేనేజర్, నవాబుపేట, నెల్లూరు
‘కుబేర’ సినిమా తరహాలో మెప్మా ఉద్యోగుల ముఠా దళిత, గిరిజనులను టార్గెట్ చేసి బ్యాంకుల్లో లోన్లు కొల్లగొడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. జిల్లాలో కొందరు టీడీపీ నేతలు నిరక్షరాస్యులైన గిరిజనులను సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా చూపించి రూ.కోట్ల వ్యక్తిగత రుణాలు తీసుకుని చేసిన మోసాలు మరిచిపోకముందే.. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని మెప్మా విభాగం ఆర్‌పీఎంలు గ్రామీణ ప్రాంతాల్లోని అమాయక గిరిజన, దళిత మహిళలకు రుణాలిప్పిస్తామంటూ వారిని ముంచేస్తున్నారు. కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ ఎన్టీఆర్‌నగర్ గిరిజన కాలనీలో మహిళలను మోసం చేసే యత్నంలో వీరి బండారం తెలిసి రచ్చ జరిగడంతో గుట్టురట్టయింది. ఈ కేటుగాళ్ల దందాలో బ్యాంక్ అధికారుల పాత్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది
బ్యాంక్
మేమెందు
కీయాలి..?..
ఇచ్చేదిలేదు


