నెల్లూరు(బారకాసు): ‘చిన్నపాటి సమస్యలను కూడా పరిష్కరించకపోతే మేముందుకు?, ప్రజల ఫిర్యాదులు, సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేసినా ఫలితం ఉండటం లేదు’ అని పలువురు కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం నగర కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కౌన్సిల్ సమావేశ మందిరంలో 2026 – 27 వార్షిక బడ్జెట్ సమావేశం మేయర్ దేవరకొండ సుజాత అధ్యక్షతన జరిగింది. అకౌంటెంట్ బడ్జెట్‌లో పొందుపరిచిన అంశాలను చదివి వినిపించారు. మేయర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ కేటాయింపులు చేపట్టామన్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్లు రూప్‌కుమార్ యాదవ్, తహసిన్, కో – ఆప్షన్ సభ్యులు, కమిషనర్ నందన్, అదనపు కమిషనర్ హిమబిందు, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఎస్‌ఈ రహంతుజానీ, ఇన్‌చార్జి సిటీ ప్లానర్ రఘునాథరావు, సెక్రటరీ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కొందరు కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు.
కార్పొరేటర్ల ఆగ్రహం
పలువురు కార్పొరేటర్లు తమ డివిజన్లలో నెలకొన్న సమస్యలపై గళాన్ని వినిపించారు. ఉన్నత స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారులు వరకు ఎవరూ కూడా సక్రమంగా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రజల నుంచి పన్నులను ముక్కుపిండి వసూలు చేయడంపై మండిపడ్డారు. తన డివిజన్ పరిధిలో 10 మందికి పైగా కుళాయి కనెక్షన్లు లేకపోయినా రూ.వేలు పన్ను కట్టాలంటూ నోటీసులు జారీ చేశారని, ఇది ఎంతవరకు సబబని 37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాసయాదవ్ అధికారులను ప్రశ్నించారు. పర్యటన నిమిత్తం వార్డులోకి వచ్చే ముందు కమిషనర్, అధికారులు సమాచారం ఇవ్వాలని అనేకమార్లు చెప్పినా కూడా పట్టించుకోలేదు. ఇప్పటి వరకు మౌనంగానే ఉన్నామని, ఇకపై కూడా అలా వస్తే ప్రజలు తిరగబడి గుణపాఠం చెబుతారని 35వ డివిజన్ కార్పొరేటర్ యాకసిరి వాసంతి అన్నారు.
ప్రజల సొమ్ము దుర్వినియోగంపై
ప్రశ్నిస్తే తప్పా?
కూటమి ప్రభుత్వం వచ్చాక కనీసం ఒక్క గ్రాంట్ కూడా కార్పొరేషన్‌కు తీసుకురాలేదని 21వ డివిజన్ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ మొయిళ్ల గౌరి అన్నారు. ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎన్‌ఎంసీలో జరిగిన అభివృద్ధి పనులు గత ప్రభుత్వంలోని ఎన్‌సీఏపీ, నుడా, జీజీఎంపీ, 15వ ఆర్థిక సంఘం నిధులు, ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన నిధుల (జనరల్ ఫండ్స్)తోనే చేశారన్నారు. పనుల పేరిట పచ్చ నేతలకు కట్టబెడుతూ దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో టీడీపీ కార్పొరేటర్ కర్తం ప్రతాప్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో గౌరి తాను ప్రజా సొమ్ము దుర్వినియోగంపై ప్రశ్నించడం తప్పా.. ట్యాక్స్ గురించి మాట్లాడుతుంటే టాపిక్‌ను డైవర్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. మౌలిక వసతుల కల్పనలో శ్రద్ధ పెట్టకుండా బ్యూటిఫికేషన్, పార్కులపై ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారన్నారు. బడ్జెట్‌లో నిధులు పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోందని, వాటిని దేనికి ఏవిధంగా ఖర్చు చేస్తారనే విషయాలపై తెలియజేయాలని అడిగారు.
లెక్కలిలా..
2024 – 25లో ఆదాయం/ఖర్చులు
ప్రారంభ నిల్వ : రూ.125.43 కోట్లు
జమలు : రూ.210.48 కోట్లు
ప్రారంభ నిల్వతో కలిపి మొత్తం
జమలు : రూ.335.91కోట్లు
ఖర్చులు : రూ.211.14 కోట్లు
అంత్య నిల్వ : రూ.124.77 కోట్లు
2025 – 26 బడ్జెట్ అంచనాలు
ప్రారంభ నిల్వ : రూ.121.30 కోట్లు
జమలు : రూ.585.48 కోట్లు
ప్రారంభ నిల్వతో కలిపి మొత్తం జమలు :
రూ.706.79 కోట్లు
ఖర్చులు : రూ.695.95 కోట్లు
అంత్య నిల్వ : రూ.10.83 కోట్లు
2025 – 26కు సవరించిన బడ్జెట్ అంచనాలు
ప్రారంభ నిల్వ : రూ.124.77 కోట్లు
జమలు : రూ.274.55 కోట్లు
ప్రారంభ నిల్వతో కలిపి మొత్తం జమలు :
రూ.399.32 కోట్లు
ఖర్చులు : రూ.272.92 కోట్లు
అంత్య నిల్వ : రూ.126.40 కోట్లు
2026 – 27 బడ్జెట్ అంచనాలు
ప్రారంభ నిల్వ : రూ.126.40 కోట్లు,
జమలు : రూ.366.35 కోట్లు
ప్రారంభ నిల్వతో కలిపి మొత్తం జమలు
రూ.492.76 కోట్లు
ఖర్చులు : రూ.473.31 కోట్లు
అంత్య నిల్వ : రూ.19.45 కోట్లతో ప్రతిపాదించి ఆమోదించారు.
కార్పొరేషన్ వార్షిక బడ్జెట్ సమావేశంలో కార్పొరేటర్ల అసంతృప్తి
రూ.473.31 కోట్లతో
ప్రవేశపెట్టిన బడ్జెట్
సమస్యలపై గళమెత్తిన
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు


