● 25 ఏళ్ల నాటి నిర్మాణాల కూల్చివేత
● కాకుటూరులో విలువైన భూమి కబ్జా
● కలెక్టర్ ఆదేశించినా చర్యలు చేపట్టని అధికారులు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని శాఖల అధికారులు పచ్చపాతాన్ని చూపుతున్నారు. అయిన వారికి ఆకుల్లో.. కానీ వారికి కంచాల్లో అనే విధంగా వారి తీరు ఉంది. రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను టీడీపీ నేతలు దర్జాగా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే అడ్డుకునేందుకు జంకుతున్నారు. కానీ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు ఏళ్ల క్రితం చేసిన నిర్మాణాలను ఆక్రమణల పేరుతో కూల్చి వేయడం వివాదాస్పదమైంది.
టీడీపీ నాయకుల కుట్రలు
వెంకటాచలం మండలంలో అధికారుల పనితీరుపై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పుంజులూరుపాడు గ్రామానికి చెందిన కరుణాకర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు. గ్రామంలో సర్వే నంబర్ 139లో 5.68 ఎకరాల పట్టా భూమి అతడికి ఉంది. 25 సంవత్సరాల క్రితం తన భూమిలోని సుమారు ఐదు సెంట్లలో రూ.5 లక్షల వ్యయంతో రెండు గదులు (కొట్లు) కట్టించాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు కరుణాకర్‌రెడ్డి పొలం వద్ద నిర్మించిన రెండు కొట్లను తొలగించాలనే కుట్రలతో అధికారులకు అర్జీలు ఇస్తూ వచ్చారు. నేతల ఒత్తిళ్లతో అధికారులు సర్వే చేయించి కరుణాకర్‌రెడ్డికి సర్వే నంబర్ 139లో 5.68 ఎకరాలు ఉందని, మిగిలిన ఐదు సెంట్లు ఆక్రమణ అని తేల్చారు. రెవెన్యూ, పంచాయతీ, సర్వే అధికారులు మంగళవారం గ్రామానికి చేరుకుని జేసీబీతో రెండు గదులను ధ్వంసం చేశారు. తన భూమిలో ఎలాంటి ఆక్రమణల్లేవని, కూటమి నాయకులు కక్ష కట్టి వాటిని నేలకూల్చారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఆక్రమణలపై చర్యలేవి?
కాకుటూరు గ్రామంలో రూ.2 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల ఆక్రమణల గురించి గ్రామస్తులు మూడుసార్లు కలెక్టర్‌కు, మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. భూ ఆక్రమణలపై సాక్షి పత్రికలో వరుస కథనాలు రావడంతో కలెక్టర్ స్పందించి నివేదిక పంపాలని ఆదేశించారు. అయినా ఆక్రమణదారులు లెక్కచేయకుండా సదరు భూముల్లో ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. కాకుటూరు భూ ఆక్రమణలకు పాల్పడిన వ్యక్తి నెల్లూరు నగరానికి చెందిన టీడీపీ నేత కావడం, అతడికి సర్వేపల్లి ముఖ్యనేత అండదండలు ఉండటంతో అధికారులు పచ్చపాతం చూపుతున్నారు. ఆక్రమణల జోలికి వస్తే జిల్లా సరిహద్దు మండలాలకు బదిలీ కావాల్సి వస్తుందని ఆక్రమణదారుల బెదిరింపులు తోడు కావడంతో సర్వేతో సరిపెట్టుకున్నారు. పుంజులూరుపాడులో ఆక్రమణల పేరుతో రెండు గదులను కూల్చిన అధికారులు, కాకుటూరులో కూడా తక్షణమే అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నారు.


