చంద్రబాబు అన్ని వర్గాల వ్యతిరేకి
● ప్రభుత్వం నడపడం లేదు..
వ్యాపారం చేస్తున్నాడు
● చుట్టూ ఉన్నవారంతా బడా వ్యాపారులు, కాంట్రాక్టర్లే
● పార్టీకి మూల స్తంభాలు నాయకులు, కార్యకర్తలే
● వచ్చేది జగనన్న ప్రభుత్వమే
● మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
కొడవలూరు: సీఎం చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల వ్యతిరేకి అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విమర్శించారు. ఆయన ప్రభుత్వాన్ని నడపడం లేదని, ప్రభుత్వంతో వ్యాపారం చేస్తున్నాడని దుయ్యబట్టారు. ఆయన చుట్టూ ఉన్న వారంతా బడా వ్యాపారులు, కాంట్రాక్టర్లేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టే పెట్టుబడులన్నీ నారా కుటుంబానికి లాభం చేకూరేలా పాలన సాగుతోందన్నారు. మండలంలోని తాటాకులదిన్నెలో సోమవారం సర్పంచ్ మారంరెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు పేద ప్రజల అభ్యన్నతి కంటే నారా సామ్రాజ్యం విస్తరణ కోసమే నిర్ణయాలు తీసుకొంటారని ఆరోపించారు. ఇన్నేళ్లు సీఎంగా ఉండి ఏనాడు పేదల భవిష్యత్‌కు ఒక్క ప్రయోజనాన్ని కల్పించారా? అని నిలదీశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ఏమాత్రం పునరాలోచన చేయడం లేదన్నారు. రాష్ట్రంలోని 17 కళాశాలలను ప్రైవేట్ పరాన్ని వ్యతిరేకిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఎక్కడ కార్యక్రమం నిర్వహించినా ప్రజలు పార్టీలకతీతంగా తండోపతండాలుగా తరలి వచ్చి నిరసన తెలుపుతున్నారని తెలిపారు.
వలంటీర్ల వ్యవస్థతోనే పార్టీకి నష్టం
వలంటీర్ల వ్యవస్థ వల్లే పార్టీ తీవ్రంగా నష్టపోయిందని ప్రసన్నకుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. 50 శాతం వలంటీర్లు గత ఎన్నికల్లో తమకు సహకరించలేదని తేల్చి చెప్పారు. కోవూరు నియోజకవర్గంలో 1,744 మంది వలంటీర్లు ఉంటే వారిలో 400 మంది రూ.20 వేల వంతున తీసుకొని ఇతర పార్టీలకు అమ్ముడుపోయారన్నారు. నాయకులు, కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని అభివర్ణించారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. గడిచిన 18 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం చేశారు. ఒక్క సంక్షేమ పధకం సక్రమంగా అమలు చేయడం లేదని, హామీలన్నీ మోస పూరితమేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ గాలి జ్యోతి, డీసీఎమ్మెస్, ఆఫ్కాఫ్ మాజీ చైర్మన్లు వీరి చలపతిరావు, కొండూరు అనిల్‌బాబు, ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్, పార్టీ మండల అధ్యక్షులు చిమటా శేషగిరిరావు, మావులూరు శ్రీనివాసులురెడ్డి, కె.నవీన్‌రెడ్డి, సీహెచ్ సతీష్‌రెడ్డి, షాహుల్, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.


