జాతీయ స్థాయి యోగా పోటీలకు ఎంపిక
ఉలవపాడు: జాతీయ స్థాయి యోగా పోటీలకు రామాయపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయుడు కేదారి కొండలరావు ఎంపికయ్యారు. ఈనెల 22న విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ క్రీడా పోటీల్లో ప్రతిభ చూపడంతో ఎంపిక చేశారు. వచ్చే ఏడాది జనవరిలో చండీగఢ్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో వ్యక్తిగత విభాగంలో పాల్గొంటానని సోమవారం ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న వారికి కనీస సౌకర్యాలు కల్పించలేదని కొండలరావు ఆవేదన వ్యక్తం చేశారు. సెలవు ఇవ్వడం మినహా రవాణా, భోజనం, వసతి ఖర్చులకు పైసా ఇవ్వలేదన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్రలో తమ పాత్ర అందరికీ తెలుసు కానీ ఆ శ్రమకు కనీస గుర్తింపు, విలువ లేదన్నారు. 55 ఏళ్ల వయసులో శరీరాన్ని నియంత్రించుకుని యోగాలో పతకాలు సాధిస్తున్న తమకు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు.


