నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలు ఈ నెల 25వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహించనున్నమని జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన సమావేశాలు జరుగుతాయన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, జిల్లా పంచాయతీ శాఖ, డ్వామా, ఆర్ అండ్ బీ, డీఆర్‌డీఏ, జిల్లా రిజిస్ట్రేషన్స్, వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖ, జిల్లా విద్యా శాఖ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ సంక్షేమం, జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవ సహకారం సంస్థలతో చైర్‌పర్సన్ సమీక్షిస్తారన్నారు. 7 స్థాయీ సంఘాల సమావేశాలు ఆయా శాఖల జిల్లా అధికారులు, జెడ్పీ సభ్యులు తప్పకుండా హాజరుకావాలని కోరారు.
మేయర్‌పై
అవిశ్వాసానికి నోటీసు
● జేసీకి అందజేసిన కార్పొరేటర్లు
నెల్లూరు (దర్గామిట్ట): నెల్లూరు నగర మేయర్ పొట్లూరు స్రవంతిపై అవిశ్వాసం తీర్మానం పెట్టాలని నగర కార్పొరేటర్లు సోమవారం జేసీ మొగిలి వెంకటేశ్వర్లకు కలెక్టరేట్‌లోని శంకరన్ హాల్లో నోటీసు అందజేశారు. డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ మేయర్ పదవీ కాలంలో కేవలం ఏడు సమావేశాలు మాత్రమే నిర్వహించారన్నారు. నగర ప్రజల, కార్పొరేటర్ల విశ్వాసాన్ని మేయర్ కోల్పోయారన్నారు. కమిషనర్ల సంతకాలు ఫోర్జరీ చేసి మేయర్ భర్త అప్రతిష్ట పాలయ్యారన్నారు. 40 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మాన నోటీస్ జేసీకి అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తహసీన్, కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు ఉన్నారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 25 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 78,974 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 28,995 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.61 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.


