రైతులను నిలువునా దగా చేసి ఇప్పుడు మీకోసం
● టీడీపీ కార్యకర్తలకే రైతుల వేషం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
తోటపల్లిగూడూరు: చంద్రబాబు రైతులను సంక్షేమ పథకాలను ఎగ్గొట్టి, పంటలకు గిట్టుబాటు ధరలు పక్కన పెట్టి కనీసం పెట్టుబడులు దక్కకుండా ధరలు పతనమవుతుంటే మౌనంగా ఉంటూ నిలువునా ముంచేశారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. ఇంకా ఏ ముఖం పెట్టుకుని రైతన్న–మీ కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నారో చెప్పాలని, ఇది మరో మోసమన్నారు. మండలంలోని ఈదూరు, మాచర్లవారిపాళెం, వెంకటాచలంలో సోమవారం కాకాణి పర్యటించారు. కాకాణి మాట్లాడుతూ రైతులను అన్ని విధాలా ముంచిన కూటమి ప్రభుత్వం రైతన్న–మీ కోసం అనే సినిమా టైటిల్ పేరుతో మరో ప్రచార ఆర్భాటానికి పూనుకొందన్నారు. రాష్ట్రంలోని రైతులు ఓ వైపు సరిపడా యూరియా అందక మరో వైపు నకిలీ విత్తనాల బెడదతో సతమతమవుతున్నారన్నారు. గడిచిన రెండేళ్లలో చంద్రబాబు రైతులకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.10 వేలు ఇచ్చి రూ.30 వేలు ఎగ్గొట్టాడన్నారు. ఉచిత పంటల బీమాకు మంగళం పాడి రైతులకు తీరని ద్రోహం చేశాడన్నారు. ధరల స్థిరీకరణ నిధి లేక రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. నాణ్యమైన విత్తనాలు దొరక్క, కట్ట యూరియా కోసం రైతన్నలు అగచాట్లు వర్ణణాతీతమన్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతును చేయిపట్టి నడిపించిన ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశాడన్నారు. ఐదేళ్ల జగనన్న పాలనలో రైతులు సుభిక్షంగా, సంతోషంగా ఉన్న విషయం అందరికి గుర్తే ఉంటుందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అన్నదాతల ప్రతి అడుగులో జగనన్న సహకారం మర్చిపోలేనిదన్నారు. రైతన్నల శ్రేయస్సు కోసం జగనన్న అమలు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు వారి జీవితాలను మార్చేసిందన్నారు. జగనన్న నాయకత్వంలో ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రైతులకు అండగా ఎల్లవేళలా వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తోందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గి రైతులు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమాల్లో అసలైన రైతులు ముఖం చాటేయడంతో టీడీపీ నాయకులే రైతుల వేషాల్లో కనబడడం రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు. చంద్రబాబు ఇకనైనా డ్రామాలు ఆపి వ్యవసాయాభివృద్ధికి, రైతు సంక్షేమానికి కృషి చేయాలని కాకాణి హితవు పలికారు.


