డిన్నర్లు ఇస్తే పరిశ్రమలు రావు
నెల్లూరు (వీఆర్సీసెంటర్): డిన్నర్లు ఇస్తే రాష్ట్రానికి పరిశ్రమలు రావని, పెట్టుబడులు వచ్చే మార్గాలను వదిలేసి, ఉచితంగా భూములిస్తే పరిశ్రమలు బాగుపడుతాయని, రాష్ట్రం అభివృద్ధి చెందదని, ఆదాయం వస్తుందంటేనే పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు తీసుకువస్తారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. నగరంలోని బాలాజీనగర్‌లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశఽంలో ఆయన మాట్లాడారు. విశాఖలో డేటా సెంటర్‌కు రూ.లక్షల కోట్లు పెట్టుబడి పెడితే 300 మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయన్నారు. చంద్రబాబు ప్రకటించిన సంజీవని పథకంపై పలు అనుమానాలు ఉన్నాయని, ఈ పథకం ఒక గేమ్ ఛేంజర్ అని ప్రకటించారన్నారు. ప్రజలకా, కార్పొరేట్ సంస్థలకా, పెట్టుబడిదారులకా అని నిలదీశారు. టాటా గ్రూపు, బిల్ గేట్స్‌తో ఒప్పందం చేసుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారని, ఆ ఒప్పందాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు గతంలో రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని చెప్పారని, నేడు పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగావకాశాలు ఇస్తానని చెప్పి పారిశ్రామిక వేత్తలకు ఉచితంగా భూములు, విద్యుత్ ఇస్తున్నారన్నారు.
ప్రభుత్వ మెడికల్ కళాశాలలతో మేలు
రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆలోచనను ఉపసంహరించుకోవాలని, పేద, మధ్య తరగతి విద్యార్థులకు మేలు చేకూర్చే ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ప్రైవేటీకరణ సరైన చర్య కాదన్నారు. ప్రభుత్వ భూముల్లో, ప్రభుత్వ నిధులతో నిర్మించిన, నిర్మిస్తున్న మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వమే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను నిర్వహించాలన్నారు. వీటికి అనుబంధంగా ఏర్పాటు కానున్న ఆస్పత్రుల ద్వారా పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందుతాయని, ప్రైవేటీకరణతో ప్రజలకు ఉచిత వైద్యం అందని ద్రాక్ష అవుతుందన్నారు.
లేబర్ కోడ్ ఉద్యమానికి సీపీఎం మద్దతు
దేశంలోని కార్మికులకు నష్టం వాటిల్లే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న నాలుగు లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ, జీతభత్యాలను తగ్గించి, పని గంటలను పెంచి, కార్మికుల భద్రతా చర్యలను హరించి, యాజమాన్యాలకు లబ్ధి చేకూర్చే విధంగా లేబర్ కోడ్స్ ఉన్నాయన్నారు. లేబర్ కోడ్స్‌లకు వ్యతిరేకంగా ఈ నెల 26వ తేదీన దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాలకు సీపీఎం పార్టీ మద్దతు ప్రకటిస్తోందన్నారు.
బూటకపు ఎన్‌కౌంటర్లపై
న్యాయవిచారణ చేపట్టాలి
దేశ వ్యాప్తంగా మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం కగార్ పేరుతో బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తోందని, చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు నాయకులు చెబుతున్నా, వారిని పట్టుకుని ఎన్‌కౌంటర్ పేరుతో హత్యలు చేస్తున్నారని, దీనిపై సుప్రీంకోర్టు న్యాయ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, మాదాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కేంద్రం తీసుకొచ్చిన లేబర్
కోడ్‌లను రద్దు చేయాలి
26న దేశవ్యాప్త ఆందోళనలకు
సీపీఎం మద్దతు
ప్రభుత్వ మెడికల్ కళాశాలల
ప్రైవేటీకరణను ఆపాలి
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు
బీవీ రాఘవులు


