సివిల్ సప్లయ్స్ గోదాము సీజ్
ఉదయగిరి: స్థానిక పౌరసరఫరాల స్టాక్ పాయింట్‌లో కొంత కాలంగా భారీ స్థాయిలో రేషన్ బియ్యం గోల్‌మాలైందంటూ శాఖ జిల్లా ప్రధాన కార్యాలయానికి సమాచారం అందిన నేపథ్యంలో గోదామును జిల్లా అధికారులు తనిఖీ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించి సుమారు 200 టన్నుల రేషన్ బియ్యం స్వాహా అయిందనే అంశాన్ని గుర్తించారని సమాచారం. ఈ మేరకు నివేదికను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు అందించారని తెలుస్తోంది. ఈ వ్యవహారంతో ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఓ ప్రైవేట్ కాంట్రాక్ట్ ఉద్యోగికి సంబంధముందని సమాచారం. ఈ మేరకు పౌరసరఫరాల స్టాక్ పాయింట్‌ను సీజ్ చేశారు.
అధికార పార్టీ నేతల హస్తం
ఉదయగిరి స్టాక్ పాయింట్ నుంచి సీతారామపురం, ఉదయగిరి, వరికుంటపాడు, మర్రిపాడు మండలాల్లోని 120 రేషన్ షాపులు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులను సరఫరా చేస్తారు. ఈ క్రమంలో దాదాపు రూ.30 లక్షల విలువజేసే 200 టన్నుల రేషన్ బియ్యం మాయమవడం వెనుక అధికార పార్టీకి చెందిన పెద్దల హస్తం ఉందని సమాచారం. ఈ పాయింట్‌కు రెగ్యులర్ డీటీ లేకపోవడంతో, ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న ప్రైవేట్ ఉద్యోగి ప్రమేయంతోనే ఈ కుంభకోణం చోటుచేసుకుందని తెలుస్తోంది. సరుకుల్లో కోత విధిస్తూ, ఆ మేరకు బియ్యాన్ని బొక్కేశారని సమాచారం. జిల్లా ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపితే, మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది. కాగా గిడ్డంగిని అధికారులు సీజ్ చేయడంతో సరుకులతో వచ్చిన లారీలు బయటే నిలిచిపోయాయి.


