వృద్ధుడి బలవన్మరణం
ఉదయగిరి: పట్టణంలోని ఏబీఎం చర్చి కాంపౌండ్ ఆవరణలో పురుగుమందు తాగి ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. దగదర్తి మండలం చవటపుత్తేడుకు చెందిన పులి ఎర్రయ్య (65) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ తరుణంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రెండు రోజుల క్రితం వెళ్లిపోయారు. దీంతో గాలింపు చర్యలను కుటుంబసభ్యులు చేపట్టారు. ఈ తరుణంలో స్థానిక ఏబీఎం చర్చి కాంపౌండ్ ఆవరణలో ఓ వ్యక్తి మృతి చెంది ఉన్నారనే సమాచారం పోలీసులకు అందింది. ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి, సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పక్కన పురుగుమందు, ఎలుకల మందు ఉండటంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని నిర్ధారించారు. గుర్తుతెలియని వ్యక్తిగా భావించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. మృతుడి బంధువులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించి స్టేషన్‌కు చేరుకున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.
పోలీసుల అదుపులో ఉపాధ్యాయుడు
వరికుంటపాడు: తూర్పుబోయమడుగులలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో బాలికపై ఉపాధ్యాయుడు జూలై ఒకటిన అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపిన విషయం విదితమే. ఈ ఉదంతంపై ఆగ్రహించిన గ్రామస్తులు, తల్లిదండ్రులు టీచర్ వెంగయ్యకు దేహశుద్ధి చేయగా, వెంటనే గోడ దూకి పరారయ్యారు. కొన్ని రోజులుగా దాగి ఉన్న వెంగయ్యను వరికుంటపాడు ఎస్సై రఘునాథ్ శనివారం అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన విచారణను జరిపి.. కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు.
కండలేరులో నీటి నిల్వ
రాపూరు: కండలేరు జలాశయంలో శనివారం నాటికి 57.84 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 550 క్యూసెక్కుల నీరు చేరుతోందని చెప్పారు. కండలేరు నుంచి సత్యసాయి గంగకు 800, పిన్నేరుకు 10, లోలెవల్‌కు 40, హైలెవల్‌కు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని వివరించారు.
వృద్ధుడి బలవన్మరణం


