పెన్నాలో చిక్కుకున్న పశువుల కాపరులు
● కాపాడిన పోలీస్, అగ్నిమాపక బృందం
ఆత్మకూరు: మండలంలోని అప్పారావుపాళెంలో గల పెన్నాలో నీటి ప్రవాహం ఎక్కువవడంతో ఆరుగురు శనివారం చిక్కుకుపోయారు. పెరుగుతున్న నీటి ప్రవాహాన్ని ముందే గమనించిన ప్రభాకర్ అనే వ్యక్తి ఒడ్డుకు చేరుకున్నారు. ఆపై డయల్ 100కు సమాచారమివ్వడంతో ఎస్పీ వేజెండ్ల ఆదేశాలతో ఆత్మకూరు సీఐ గంగాధర్, ఫైర్ అధికారి బాలాజీ, ఎస్సైలు జిలానీ, సాయిబాబా, రాజేష్ ఘటన స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ను నిర్వహించి చిక్కుకుపోయిన ఆరుగుర్నీ క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. వివరాలు.. గ్రామంలోని తూర్పు దళితవాడకు చెందిన చెన్నయ్య, వెంకటరమణయ్య, నడివీధి పెంచలమ్మ, గంటా కవిత, గంటా నాగలక్ష్మి, కాలేషా, ప్రభాకర్ రోజు మాదిరిగానే పశువులను తోలుకొని పెన్నా అవతలివైపు పొరంబోకు భూములకు వెళ్లారు. సాయంత్రం 4.30 సమయంలో తిరిగి ఇంటికొచ్చే క్రమంలో పెన్నాలో నీటి ప్రవాహం అధికమైంది. దీంతో పరిస్థితి అర్థంగాక సమీపంలోనే ఉన్న ఓ సెల్ టవర్ వద్దకొచ్చేందుకు యత్నించారు. అక్కడ సైతం లోతుగా ఉండటంతో, కొద్దిపాటి గట్టిగా ఉన్న ప్రాంతానికి రెల్లుగడ్డిని పట్టుకొని కష్టపడి చేరుకున్నారు. అయితే గంటా ప్రభాకర్‌కు ఈత రావడంతో అవతలి గట్టుకు చేరుకున్నారు. ఫోన్లో నెల్లూరు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సీఐ, ఎస్సైలు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. సంగం నుంచి చిన్న బోట్లను తెప్పించారు. వాటి ఆధారంగా మోకులను పట్టుకొని సంగం నుంచి వచ్చిన గజ ఈతగాళ్ల సాయంతో బాధితులను ఒక్కొక్కరుగా రాత్రి తొమ్మిది గంటల సమయంలో చేర్చారు. దీంతో ప్రాణాపాయం తప్పింది.


