
నిరంకుశ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం
● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నిరంకుశ పాలనతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం తన కార్యాలయం నుంచి కావలికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా బాలాజీనగర్ పోలీసులు అడ్డుకుంటూ నోటీసులు ఇవ్వడాన్ని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక రెడ్‌బుక్ రాజ్యాంగంలో ఉన్నామంటూ మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లడాన్ని అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ రాక్షస ఆనందాన్ని పొందుతుందన్నారు. కూటమి నేతల అరాచకాలకు పోలీసులు వంత పాడడం దారుణమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా అనే సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతుందన్నారు. కావలిలో అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను బయటపెడతానని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి హెచ్చరించడంతో ఆయనపై ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణమన్నారు. ప్రతాప్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు కావలి వెళ్లే ప్రయత్నం చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. జిల్లాలో ఎప్పుడూ చూడని వికృతాలు చూడాల్సిన వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కావలికి వెళ్తే నరుకుతామని చెబుతున్న వారిని పోలీసులు వదిలేసి తమను నిర్బంఽధించడం చూస్తుంటే కూటమి ప్రభుత్వ దుర్మార్గాలు ప్రజలకు ఇట్టే అర్థమవుతున్నాయన్నారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కావలికి వెళ్లి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తామని తెలిపారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వైఎస్సార్‌సీపీ బెదిరేది లేదన్నారు.